బాబు హయాంలో దినదినగండంగా ఆర్టీసీ

6 Dec, 2018 18:50 IST

చంద్రబాబు దీక్ష చేస్తే ఆర్టీసీ బస్సులు కావాలి. సభ పెడితే జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులు కావాలి. పోలవరం చూసిరండంటూ ప్రచారం చేయించుకోవడానికి ఆర్టీసీ బస్సులు కావాలి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు వాడుకున్నంతగా ఎపి ప్రజలు ఊడా వాడి ఉండరేమో? ఏడాదిలో కనీసం అరడజను సమాఖ్యలు, సభలు పెట్టి చంద్రబాబు ఆర్టీసీ నెత్తిన శెఠగోపం పెడుతున్నాడు. అద్దెకు తీసుకున్న బస్సులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్టీసీ అప్పుల్లో కూరుకుపోతోంది. ఆ నష్టాలనుంచి బయటపడేందుకు ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి వస్తోంది. పల్లెల్లో విరివిగా తిరిగే ఆర్టీసీ సర్వీసులు రద్దు చేసుకుని మరీ నష్టాలను పూడ్చుకునే పనిలో పడుతోంది. ఫిట్ నెస్ లేక మూలనపడ్డ బస్సులతో ఆర్టీసీకి మరింత లాస్. గతేడాది ఆర్టీసీ కిలోమీటరకు 4.90 రూపాయిల నష్టం భరించాల్సి వచ్చింది. ఈ ఏడాది పరిస్థితి మరింతగా దిగజారేలా ఉందని అధికారులే అంటున్నారు. 
ఆర్టీసీ కార్మికుల కష్టాలను కూడా చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. విభజన సమయంలో ఆర్టీసీలో 62వేలమంది కార్మికులుఉన్నారు. 2018కి వారి సంఖ్య 54,500 కి చేరింది. 2016లో 126 కోట్ల కిలోమీటర్ల పరిధిలో తిరిగిన ఆర్టీసీ బస్సులు ఇప్పుడు 118 కోట్ల కంటే తక్కువ కిలోమీటర్లే తిరుగుతున్నాయ్. కాంట్రాక్టు కార్మికులకు న్యాయం చేస్తానన్న బాబు వారిని కొనసాగించడం లేదు. ఉన్నవాళ్లతోనే గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారు. ఒకపక్క రిటైర్ అయిన డ్రైవర్ల స్థానంలో కొత్తవారిని నియమించుకోవడం లేదు. దీనివల్ల ఉన్నవారిపైనే పని భారం పెరుగుతోంది. డ్రైవర్లపై వత్తిడి పెరిగిపోతోంది. డబుల్ డ్యూటీలపేరుతో అధికారుల వేదింపులు ఎక్కువౌతున్నాయి. మనోవేదనతో అనారోగ్యాల పాలౌతున్న కార్మికులకు బీమా సౌకర్యం కూడా అరకొరగానే ఉంది. ఒకపక్క కండక్టర్లను కుదించి డ్రైవర్లపై అదనపు బాధ్యతలు మోపుతున్నారు. చిన్న కారణలకే డ్రైవర్లపై చర్యలు తీసుకోవడం, వేధింపులకు గురిచేయడంతో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ వత్తిడి తట్టుకోలేక కొందరు డ్రైవర్లు విధినిర్వాహణ సమయంలోనే గుండెపోటుకు గురై మరణించిన సంఘటనలెన్నో!!  
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని గతంలో ఉమ్మడిరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు ప్రయత్నించారు. అయితే కార్మికుల వ్యతిరేకత పెద్ద ఎత్తున ఎదురవడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు పర్మినెంట్ ఉద్యోగులపై భారం పెంచడమే కాక, ఔట్ సోర్సు ఉద్యోగులతో ఆర్టీసీని నడపాలనే ఆలోచనలో ఉన్నాడు చంద్రబాబు. నెమ్మదిగా సంస్థను నష్టాల్లో ముంచి చివరకు ప్రైవేటు పరం చేయడమే చంద్రబాబు ఆలోచనలా ఉంది అంటున్నారు ఆర్టీసీ కార్మికులు. మరోసారి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆర్టీసీ గతి అధోగతే అని ఉద్యోగులే అనుకోవడం ఆర్టీసీ దుస్థితికి అద్దం పడుతోంది.