వెంకటయ్యకు అభిమానమే ఆలంబన
వైయస్ వెంట, ఆయన కుమార్తె షర్మిల వెంట కూడా పాదయాత్ర చేస్తున్నారు ఓ వికలాంగుడు. ఆయనే వెంకటయ్య. ఆయన పట్టుదల అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తోంది. వనపర్తికి చెందిన వెంకటయ్య 2003లో రాజశేఖరరెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి చేపట్టిన పాదయాత్రలో ఇచ్చాపురం వరకు ఆయన వెంట నడిచాడు. ఇప్పుడు ప్రజాసమస్యలు తెలుసుకోవడానికి ఆ మహానేత కుమార్తె షర్మిల తండ్రిబాటలోనే నడుస్తూ మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు. ఈ యాత్రలోనూ వెంకటయ్య మనోధైర్యంతో పాదయాత్ర వెంట నడుస్తూ వైయస్ కుటుంబంపై ఉన్న విధేయతను చాటుతున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గం చందాపురం గ్రామానికి చెందిన వెంకటయ్య వృత్తి వ్యవసాయం. వైయస్ అంటే అమితమైన అభిమానం. అందుకే ప్రతిపక్షహోదాలో సమస్యలు తెలుసుకోవడానికి దివంగత నేత రాజన్న చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో వెంకటయ్య పాల్గొని ఇచ్చాపురం వరకు వెంట నడిచారు. వైయస్ ప్రభుత్వం వచ్చాక జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి సహకారంతో చందాపురం సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. మహానేత మరణానంతరం వైయస్ కుటుంబంపై జరుగుతున్న రాజకీయ కక్షలు, కుట్రలు కుతంత్రాలకు చలించిపోయాడు. అందుకే తనవంతు కర్తవ్యంగా షర్మిల ఇడుపలపాయ నుంచి చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొని వెంట నడుస్తున్నాడు. ఇప్పటి వరకు 37రోజులపాటు సుమారు 490 కిలోమీటర్లు నడిచాడు.
వైయస్‌పై అభిమానంతోనే: వెంకటయ్య
అప్పుడు వైయస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతోనే పాదయాత్రలో పాల్గొన్నాను. ఆయన నాపై దయచూపాడు. ఆయన సహకారంతో సర్పంచిగా గెలుపొందాను. రాజన్న మరణానంతరం కాంగ్రెస్, టీడీపీలు వైయస్ కుటుంబంపై చేస్తున్న కుట్రలు ఎంతోబాధ కలిగించాయి. అందుకే రాజన్న బిడ్డ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం యాత్రలో కష్టమైనా పాల్గొంటున్నా.