కిరణ్‌ సమైక్యవాదా? సోనియా ఏజెంటా?

13 Oct, 2013 22:33 IST

హైదరాబాద్, 13 అక్టోబర్ 2013: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  సమైక్యవాదా? లేక సమైక్యవాది ముసుగులో ఉండి సోనియా గాంధీ విభజన అజెండాను అమలు చేయడానికి పనిచేస్తున్న ఏజెంటా? అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎం.వి. మైసూరారెడ్డి ప్రశ్నించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆయన గుర్తుచేశారు. ప్రజలకు తమ  అభిప్రాయం చెప్పడం  కోసం సమైక్య శంఖారావం సభను ఏర్పాటు చేసుకోదలచినట్లు ఆయన తెలిపారు. ఈ సభకు అనుమతి ఇవ్వకపోవడం భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమే అని మైసూరారెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

నచ్చిన వారు సభలు పెట్టుకుంటే సకల సౌకర్యాలూ కల్పిస్తారని, భద్రత, రక్షణ కూడా కల్పిస్తారని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. తమకు నచ్చకపోతే మాత్రమే శాంతి భద్రతలు గుర్తుకు వస్తాయా? అని ప్రశ్నించారు. పాపం పోలీసులంటే అధికార పార్టీ ఏది చెబితే అది దానికి వంత పాడడం అధికారులకు రివాజుగా మారిందని ఆరోపించారు. సమైక్య శంఖారావం సభకు అనుమతి నిరాకరించడానికి డిసిపి తెలిపిన వివరాలు దానికి అద్దంపడుతున్నాయన్నారు.

తెలంగాణపై సిడబ్ల్యుసి తీర్మానం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందని మైసూరారెడ్డి అన్నారు. అది పార్టీకి చెందిన ఒక  వైఖరి మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి గురించి పోలీసులు ప్రచారం చేయాల్సిన అవసరం ఏమిటో తనకు అర్థం కావడంలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలే గాని పార్టీ వ్యవహారాల్లో తలదూర్చాల్సిన ఆవశ్యకత పోలీసులకు ఏమి ఉందని ప్రశ్నించారు. పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం కూడా అవుతుందని అన్నారు. ఇటువంటి  వైఖరితో తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని అంతర్గత విషయాలను పోలీసులు పేర్కొనడం ఏమిటన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ అంటే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందన్న మంచి పేరు, ప్రతిష్టలు ఉండేవన్నారు. అలాంటి పేరుకు పోలీసులు మచ్చతెచ్చారని మైసూరారెడ్డి విమర్శించారు.

ఇప్పటికి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకుంటున్నామని, హైదరాబాద్ నగరం ఈ రాష్ట్రానికి రాజధానిగానే ఉన్నదని అనుకుంటున్నామని మైసూరారెడ్డి అన్నారు. రాజధానిలో వివిధ పార్టీలు, వివిధ వ్యక్తులు ఎవరైనా తమ అభిప్రాయాలు తెలుపుకునేందుకు స్వేచ్ఛ ఉందన్నారు. ఈ స్వేచ్ఛకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అన్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. అందరి భావాలు ఒక రకంగా ఉండవు. భావాలు వేరుగా ఉండవచ్చు. కొందరు సమైక్యాన్ని కోరుకోవచ్చు, మరి కొందరు విభజనను కోరుకోవచ్చన్నారు. ఎవరి అభిప్రాయాలను వారు చెప్పుకోవడం భావ ప్రకటన స్వేచ్ఛ అవుతుందన్నారు.

భావాన్ని చెప్పుకోవడం తప్పు అనడం, వినడానికి వచ్చేవారిని విచ్ఛిన్నకర శక్తులు, విధ్వంసకారులు అనడం అంటే మీరే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మైసూరారెడ్డి ఆరోపించారు. భావాలు వేరుగా ఉండవచ్చు గాని ప్రాంతాల మధ్య విభేదాలు లేవన్నారు. తమ భావాలను ప్రజలకు చెప్పుకోవడం తప్పుకాదన్నారు. ప్రభుత్వం, పోలీసులు సాకులు చెప్పడం  చాలా తప్పు అన్నారు. సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్న ముఖ్యమంత్రికి ఇది తగునా? అని ఆయన ప్రశ్నించారు. సమైక్య శంఖారావం సభను ఇలా వంకలు పెట్టి అడ్డుకోవడం తగదని మైసూరారెడ్డి అన్నారు.


 రాజకీయ పార్టీలు తమ విధానాలను మార్చుకున్నాయని పోలీసులు అంటున్నారని, అధికార యంత్రాంగానికి దీనితో ఏమి సంబంధమని మైసూరారెడ్డి ప్రశ్నించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పార్టీలు తమ అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటాయన్నారు. అధికారంలోకి వచ్చాక తమకు అనుకూలంగా మార్చుకుంటారన్నారు. ఆ మాత్రం తెలియకపోతే ఐపిఎస్ అనుకోవాలా? లేక అధికార పార్టీ ఏజెంట్లు అనుకోవాలా? అన్నారు. తమ పార్టీది మొదటి నుంచి ఒకటే అభిప్రాయం అని మైసూరారెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలన్నా, సమైక్యంగా ఉంచాలన్నా రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం సర్వాధికారాలూ కేంద్రానికే ఉన్నాయన్నారు. ఈ విషయాన్నే తాము అఖిలపక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రికి ఇచ్చిన అభిప్రాయంలో చెప్పామన్నారు. కానీ కొందరు కేంద్ర నాయకులు తమ స్థాయి మర్చిపోయి గ్రామస్థాయి నాయకుల మాదిరిగా మాట్లాడడం తగదని మైసూరా హితవు చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలని, వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టాలని దిగ్విజయ్ సింగ్, సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అలా మాట్లాడే రాజకీయ నాయకులకు తమ పార్టీ సమాధానం చెబుతుందన్నారు. ఇలాంటి విషయాలు పోలీసులు మాట్లాడాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు.

అన్ని సమస్యలూ పరిగణనలోకి తీసుకున, ఎవరికీ అన్యాయం జరగకుండా అందరి అభిప్రాయాలు తెలుసుకొని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని తమ పార్టీ కోరుతున్నట్లు మైసూరారెడ్డి చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటే... మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా దిగ్విజయ్ సింగ్ గారూ అని నిలదీశారు. కేంద్ర హోంమంత్రిగా ఉన్న షిండేకు ఇంగితం తెలియదా అన్నారు. ఆయన కింద పనిచేస్తున్న పోలీసు బాస్ అంతకన్నా లేదా? అన్నారు. ఏదీ చూసుకోకుండా కళ్ళు మూసుకుని ఆర్డర్లు పాస్ చేస్తే.. అవి చెల్లుతాయనుకుంటున్నారా? అని పోలీసు అధికారులను మైసూరారెడ్డి నిలదీశారు. అందుకే తమ సభకు అనుమతి నిరాకరిస్తూ.. ఆర్డరు పంపిన పోలీసుల తీరుపై కోర్టుకు వెళతామని ఆయన స్పష్టంచేశారు. తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్నా ధీమాను మైసూరా వ్యక్తం చేశారు.

విభజన వల్ల అన్ని ప్రాంతాలూ నష్టపోతాయనేది తమ పార్టీ అభిప్రాయం అన్నారు. ఐకమత్యంగా ఉంటేనే రాష్ట్రం కూడా బలంగా ఉంటుందని అన్నారు. ఐకమత్యంగా ఉంటేనే కేంద్రం నుంచి ఏదైనా సాధించుకునే వీలుంటుందన్నారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని అప్పుడే దేశంలో మనకు ప్రాముఖ్యత వస్తుందన్నది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కూడా మూడు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశారని, అందుకే అన్నచోట్లా ఆయనకు అభిమానులున్నారని మైసూరా చెప్పారు. కలిసి ఉంటే కలదు సుఖం అనే భావనను సభ పెట్టి అందరికీ చెప్పాలనేది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అన్నారు. అంతేగాని ఇతరులకు వ్యతిరేకమనో, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాలనో పార్టీ సభ నిర్వహించాలనుకోవడం లేదన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రకటించుకోవాలనుకున్న తమ పార్టీకి రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారులు కుంటి సాకులతో అనుమతి నిరాకరిస్తూ ఆర్డర్ పంపించడం పూర్తిగా అనైతికం అన్నారు.