ఉద్యోగినిపై అత్యాచారంపై జగన్‌ దిగ్భ్రాంతి

23 Oct, 2013 10:57 IST
హైదరాబాద్, 23 అక్టోబర్ 2013:

హైదరాబాద్‌‌లో సాఫ్టువేర్‌ ఉద్యోగినిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన పట్ల వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. ఢిల్లీలో జరిగిన నిర్భయ తరహా దుస్సంఘటనలు హైదరాబాద్‌లో కూడా చోటుచేసుకోవడం చాలా తీవ్రమైన అంశమని మంగళవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరిగే ఘాతుకాలకు, హింసకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించేలా పోలీసు, పౌర సమాజం కలిసి పనిచేయాలని శ్రీ జగన్‌ పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌ సంఘటన పూర్వాపరాలను పరిశీలించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. దుర్మార్గుల చేతిలో పలు గంటల పాటు శారీరక, మానసిక హింసకు గురైన బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బాధితురాలికి అవసరమైన వైద్య సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలని శ్రీ జగన్‌ డిమాండ్‌ చేశారు. ఇంతటి ఘోరానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు.