రాష్ట్ర విభజన ద్రోహి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డే

20 Nov, 2013 20:01 IST
హైదరాబాద్, 20 నవంబర్ 2013:

  రాష్ట్ర విభజన ప్రకటన చేసే ముందర కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ, సీడబ్ల్యూసీ సమావేశాల్లో విభజనకు అనుకూలంగా గంగిరెద్దులా తలాడించి వచ్చిన సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి ఇప్పుడు సమైక్యవాదానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు డ్రామాలాడుతున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆక్షేపించారు. మూడు రోజుల క్రితం జీఓఎంకు సుమారు 87 పేజీల నివేదిక ఇచ్చానని, రాష్ట్రం సమైక్యంగా ఉంటే తప్ప అభివృద్ధి చెందబోదని తాను వివరించానని సీఎం చెప్పుకున్నారన్నారు. రెండు నెలల పాటు ఆంధ్రప్రదేశ్‌ అట్టుడికిపోయిందని, ఎక్కడి పనులు అక్కడే స్తంభించిపోయాయని, అన్ని వ్యవస్థలూ అచేతనావస్థకు వెళ్ళిపోయినా కిరణ్ మౌనం దా‌ల్చారని ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డితో కలిపి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో భూమన కరుణాకరరెడ్డి మాట్లాడారు. రాష్ట్ర విభజన ద్రోహి కిరణ్‌కుమార్‌రెడ్డే అని దుమ్మెత్తిపోశారు.
విభజన ప్రకటన వచ్చిన రోజునే సీఎం, ఆయన మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసి ఉంటే కేంద్రప్రభుత్వం, సోనియా గాంధీ విభజనకు సాహసం చేసి అవకాశమే ఉండేది కాదని భూమన అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దల చెప్పిందానికల్లా ఒప్పుకుని, రాష్ట్రంలోకి వచ్చి తానేదో సమైక్య సింహం అనేలా ఫోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఆకాశమంత ఎత్తున సమైక్య ఉద్యమాన్ని ఉద్యోగులు నిర్వహిస్తున్న దశలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తప్పుడు భరోసా కల్పించి, ఉద్యమాన్ని నీరుగార్చడానికి అధిష్టానానికి ఆయుధంలా సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి ఉపయోగపడ్డారని భూమన ఆగ్రహం వ్యక్తంచేశారు. విభజన నిర్ణయంలో కీలకపాత్ర వహించారని, విభజన జరుగుతూ ఉంటే.. హైదరాబాద్‌లో కూర్చొని ప్రేక్షకపాత్ర వహించారని దుయ్యబట్టారు. సమైక్య ఉద్యమానికి అనుకూలంగా తాను రాజీనామా చేస్తున్నానన్న మాట ఏనాడూ సీఎం అనలేదన్నారు.

విభజన విషయంలో కిరణ్‌రెడ్డి, ఆయన మంత్రివర్గంలోని సీమాంధ్రులు తలా ఒక మాట మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురిచేశారని భూమన ఆరోపించారు. కొత్త రాజధాని విషయంలో తలొక రకంగా మాట్లాడారని, విభజన జరిగిపోయింది.. ప్యాకేజీలు కావాలని మరికొందరు అనడాన్ని ఆయన ఎద్దేవా చేశారు.

తాజాగా అసెంబ్లీ స్పీకర్‌తో తనకు విభేదాలున్నట్లుగా పత్రికల్లో రాయించుకుంటూ.. మీడియాలో వార్తలు వచ్చేలా చూసుకుంటున్నారని భూమన విమర్శించారు. అసెంబ్లీని ప్రొరోగ్‌ చేస్తే.. సమావేశాలు జరిపే అవకాశం పూర్తిగా తన చేతుల్లోకి వస్తుందని మాయ చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీని సమావేశ పరచండి.. సమైక్య తీర్మానం చేద్దామని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చాలా రోజులుగా డిమాండ్‌ చేస్తుంటే.. ఉలుకూ పలుకూ లేకుండా సీఎం కిరణ్‌ ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విభజన చేస్తున్నదీ కిరణ్‌కుమార్‌రెడ్డే.. వ్యతిరేకం అంటూ మాట్లాడుతున్నదీ ఆయనే అన్నారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న ఏడు కోట్ల మంది సీమాంధ్రుల్లో నిర్వేదాన్ని కల్పిస్తున్న వ్యక్తీ కిరణే అన్నారు.

మూడున్నరేళ్ళుగా ఒక్క ప్రజా సమస్యను కూడా పరిష్కరించలేని నీచస్థాయికి ఈ ప్రభుత్వం దిగజారిపోయిందని భూమన నిప్పులు చెరిగారు. రచ్చబండ కార్యక్రమంలో తనను నిలదీయడానికి వచ్చిన ప్రజల దృష్టి మళ్ళించడానికే కిరణ్‌ సమైక్యాంధ్ర అంటూ మాట్లాడారని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేక.. సమైక్యవాదాన్ని టానిక్‌లా సీఎం వాడుకుంటున్నారని విమర్శించారు.