చంద్రబాబు ఆటలు ఇక సాగవు: చెంగల
24 Sep, 2012 01:26 IST
నక్కపల్లి (విశాఖ జిల్లా), 23 సెప్టెంబర్ 2012: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆటలు ఇకపై సాగబోవని టిడిపికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు హెచ్చరించారు. చంద్రబాబు ఎన్నక కపట యాత్రలు చేసినా ఆయనకు అధికారం దక్కడం కల్ల అని వెంకట్రావు వ్యాఖ్యానించారు. నక్కపల్లిలోని తన ఇంటిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ చివరికి ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కూడా దారుణంగా విఫలమయిపోయిందని చెంగల దుయ్యబట్టారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై వైయస్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
వీటన్నింటినీ గమనించిన ప్రజలు ఇటీవలి ఉప ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెప్పారనీ, అయినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు సరికదా సిగ్గు లేకుండా పాదయాత్రకు సిద్ధమవుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఆయనపై నమ్మకం తుడిచిపెట్టుకుపోయిందని, ఎన్ని వేషాలు వేసినా అధికారం రాదని చెప్పారు. వచ్చే నెల 29న వైయస్ విజయమ్మ సమక్షంలో తాను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు చెంగల ప్రకటించారు. పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేసి జగన్‌ను సీఎంను చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు.