చంద్రబాబూ ముస్లింలు నిన్నెందుకు నమ్మాలి?
28 Sep, 2012 06:38 IST
హైదరాబాద్, 28 సెప్టెంబర్ 2012: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ముస్లింలు ఎప్పటికీ నమ్మబోరని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు హబీబ్ అబ్దుల్ రెహ్మాన్ (హెచ్‌ఎ రెహ్మాన్) నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు 15 నుంచి 20 ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తానంటూ చంద్రబాబు చెప్పడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. 2014లో వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి మొత్తంగా 10 మంది ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి కూడా లేదన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకుంటే మంచిదని రెహ్మాన్ హితవు పలికారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిం మైనార్టీల వ్యతిరేకత విషయంలో ఎల్‌కే అద్వానీతో సమానంగా చంద్రబాబు వ్యవహరించారని ఈ సందర్భంగా ఆయన నిప్పులు చెరిగారు.
నగదు బదిలీ పథకాన్ని ప్రకటించిన చంద్రబాబు రెండో కేఏ పాల్ అని రెహ్మాన్ అభివర్ణించారు. గత ఎన్నికల్లో తమ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు నగదు బదిలీ చేస్తామన్న కేఏ పాల్‌నూ ఓటర్ల నమ్మలేదని, అలాగే ఒక్కో కుటుంబానికి నెలకు రెండు వేల రూపాయలు అందిస్తామన్న చంద్రబాబునూ విశ్వసించలేదని అన్నారు. ఉప ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదని, దాని ఉనికే అడ్రస్ లేకుండా పోతున్నదని రెహ్మాన్ వ్యాఖ్యానించారు.
బాబ్రీ మసీదు కూల్చివేత సమంయంలో చంద్రబాబు నాయుడు బిజెపితో జతకట్టిన విషయాన్ని ముస్లింలు ఎప్పటికీ మరిచిపోయే ప్రశ్నే లేదన్నారు. ముస్లిం మైనార్టీల వ్యతిరేకి బిజెపితో ఆయన 20 ఏళ్ళ పాటు అంటకాగిన చంద్రబాబు ఈ రోజు 15 టిక్కెట్లు ఇస్తామనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ముస్లిం మైనార్టీల గురించి మాట్లాడే అర్హతే చంద్రబాబుకు లేదని ఆయన తెగేసి చెప్పారు. త్వరలోనే బాబు దుకాణం బంద్ అయిపోతుందని రెహ్మాన్ జోస్యం చెప్పారు.
ఈ రాష్ట్రంలోని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు అన్ని వర్గాల ప్రజలకూ మేలు జరగాలని తాము కోరుకుంటున్నామన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి వల్లే ఇది సాధ్యమవుతుందని రెహ్మాన్ ధీమా వ్యక్తం చేశారు. ముస్లింలకు గతంలో మేలు చేసింది ఒక్క దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే అని, అలాంటి పరిపాలన మళ్ళీ ఆయన కుటుంబానికి సాధ్యం అవుతుందని చెప్పారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు.
స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన అనేక పథకాలపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నిన్నటి మైనార్టీ సమావేశంలో వైయస్ పథకాలనే మళ్ళీ ప్రవేశపెడతామని ప్రస్తావించడాన్ని రెహ్మాన్ ఎద్దేవా తప్పుపట్టారు. చంద్రబాబు 'పొలిటికల్ డెత్' ప్రారంభమైందన్నారు. 2013 లో ఎన్నికలు వచ్చినా లేక 2014లో వచ్చినా ఉప ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని రెహ్మాన్ పేర్కొన్నారు.