అసలు టార్గెట్‌ను వదిలిన కాంగ్రెస్
మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి దయతో మంత్రి పదవులు అనుభవిస్తున్న వారే 'టార్గెట్ జగన్' అన్నట్లు మాట్లాడడం విడ్డూరం అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు టార్గెట్ చేయాల్సింది ఎవరినో మర్చిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బుధవారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆ మహానాయకుడి ఫొటో కూడా పెట్టకపోవడాన్ని, ఆయనను స్మరించుకోకపోవడాన్ని జూపూడి తప్పుపట్టారు. మహానేత వైయస్ అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా? అని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిని జనం గుండెల్లో నుంచి తొలగించాలని చూశారని దుమ్మెత్తిపోశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో జూపూడి ప్రభాకరరావు మాట్లాడారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వైయస్‌ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.
రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని, పేదలకు ఇచ్చే బియ్యాన్ని 30 కిలోలకు పెంచుతామని హామీ ఇచ్చి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రెండవసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని జూపూడి గుర్తుచేశారు. ఈ రెండు ప్రధాన హామీలనూ కొనసాగిస్తూ.. 2009 ఎన్నికలను ఒక పరీక్షగా భావించి, కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేసిన మహా నాయకుడు వైయస్ రాజశేఖరరెడ్డి అన్నారు. మహానేత వైయస్ మరణానంతరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది గంటల విద్యుత్ ఏనాడైనా ఇచ్చిందా? అని జూపూడి ప్రభాకర్‌రావు ప్రశ్నించారు. నిబంధనలు లేకుండా మహానేత వైయస్‌ఆర్ ఫీజు రీయింబర్సుమెంట్‌ను విజయవంతంగా అమలు చేశారని, ప్రస్తుత పాలకులు దానిని అటకెక్కించారని ఆయన దుయ్యబట్టారు. డాక్టర్ వైయస్‌ఆర్ 942 వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేరిస్తే.. కిరణ్ ప్రభుత్వం దాని నుంచి 130 వ్యాధులను తొలగించిన వైనాన్ని జూపూడి ప్రస్తావించారు.
ఐదు సంవత్సరాల్లో ఏరోజూ పెంచని ధరలను పెంచి ప్రజలకు మహానేత ఇచ్చిన వాగ్దానానికి భంగం కలిగించారా? లేదా? అని కాంగ్రెస్ నాయకులను జూపూడి సూటిగా ప్రశ్నించారు. ఆయన ఇచ్చిన హామీని విస్మరించి, ధరలను విచ్చలవిడిగా పెంచి ప్రజల మీద భారం మోపారని జూపూడి ధ్వజమెత్తారు. డాక్టర్ వైయస్‌ఆర్ ఇచ్చిన ఫీజు రీయింబర్సుమెంటు, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలన్నింటినీ కిరణ్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని నిప్పులు చెరిగారు. ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సలకు రాజశేఖరరెడ్డి సుమారు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేస్తే.. ఇప్పుడు పది వేల రూపాయలకు మించి ఖర్చయ్యే వ్యాధులను ఆ జాబితా నుంచి తొలగించారని విమర్శించారు.
శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని ఆర్థిక ఉగ్రవాది అంటూ అవాకులూ చెవాకులు మాట్లాడిన ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై జూపూడి నిప్పులు చెరిగారు. శ్రీ జగన్ ఆర్థిక ఉగ్రవాది అయితే.. ఆ 26 జిఓలు సక్రమమే అని సుప్రీంకోర్టుకు ఎలా చెప్పారని ఆయన నిలదీశారు. ఈ జిఓల్లో క్విడ్ ప్రో కో జరగలేదని, బిజినెస్ రూల్సు ప్రకారమే జారీ చేశామని, రెండు లక్షలకు మించిన లావాదేవీలపై నిర్ణయాలను సిఎం ఒక్కరే చేయలేరని, కేబినెట్ సమష్టి నిర్ణయం అని నిన్నగాక మొన్న రాజీనామా చేసిన మంత్రులు ధర్మాన, సబితా ఇంద్రారెడ్డి చెప్పిన మాటలు ఆరోపణలు చేస్తున్న వారి చెవికి ఎక్కడం లేదా? అని జూపూడి ప్రశ్నించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఉరితీయాలని, మహానేత కుటుంబాన్ని రాష్ట్రం నుంచే వెలివేయాలని మాట్లాడుతుండడం సరికాదన్నారు. శ్రీ జగన్ బయటికి వస్తే భయపడిపోయే వాతావరణాన్ని ఎందుకు సృష్టించుకుంటున్నారని జూపూడి ప్రశ్నించారు.
ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి సంతృప్త స్థాయిలో కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరికీ అమలు చేశారని, కానీ కిరణ్ ప్రభుత్వం పది వేల లోపు ర్యాంకు వచ్చిన వారికి మాత్రమే అమలు చేస్తామని చెప్పడాన్ని జూపూడి తప్పుపట్టారు. ఇలా నిబంధన పెట్టిన మీరు ఆ పథకం విజయవంతంగా అమలవుతోందని ఏ విధంగా చెప్పుకుంటారని నిలదీశారు. అంటే రాజశేఖరరెడ్డి వాగ్దానాన్న వదిలేసినట్లు కాదా? ప్రజలేమైనా పిచ్చోళ్ళా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను జనం నిశితంగా గమనిస్తున్నారని హెచ్చరించారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు, మరో పక్కన కాంగ్రెస్ నాయకులు 8 గంటల పాటు విస్తృత సమావేశం నిర్వహించి వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ను, శ్రీ జగన్‌ను విమర్శిస్తుంటే ప్రజలు గ్రహించలేరనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని మహానేత చూపించిన మార్గాన్ని అనుసరించని కాంగ్రెస్ పార్టీ, శ్రీ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని టిడిపి రెండూ కలిసి కుమ్మక్కై కుట్రలు పన్నడాన్ని జూపూడి ప్రభాకర్‌రావు తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికలు వచ్చే వరకూ ఆయన బయటకు రారని సందేశాన్ని పంపించేలా చేస్తుండడం, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని అనామకం చేయాలన్న దుర్బుద్ధితో ఉపన్యాసాలు చేయడం తగదని హితవు పలికారు. మహానేత వైయస్‌ఆర్ ఆశయాలకు నిజమైన వారసుడైన శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ కాకపోయినా రేపైనా బయటికి వస్తారని, ఆయన పథకాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తారని జూపూడి అన్నారు. వైయస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడమే లక్ష్యంగా ఏర్పాటైన వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన కాంగ్రెస్, టిడిపిలను ప్రజలు ఇప్పటికే టార్గెట్ చేశారని, త్వరలోనే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.