ప్రజల మధ్యే వైయస్ జగన్ నూతన సంవత్సర వేడుకలు
శ్రీకాకుళం: ‘ఎలా బతికామన్నదే ఆయనకు ముఖ్యం… ఎంతకాలం బతికామన్నది కాదు’. నల్లకాలువ సభలో చేసిన వాగ్దానం.. నిత్య ‘ఓదార్పు’ పథగామిని చేసింది. తండ్రిలా ‘పేదల కోసం బతకాలి… ప్రజల విశ్వాసాన్ని పొందాలి’అనే ఆకాంక్ష ఆయన్ను దీక్షాదక్షుడిగా మార్చింది. నలుగు పదుల వయసులో తాతలనాటి తరగని ఆస్తులతో కులాసాగా గడపాల్సిన ఆయన, ఎండనకా.. వాననకా పేదల కోసం పరితపిస్తున్నాడు.
2017వ సంవత్సరం నవంబర్ 6 తేదీ ఇడుపులపాయలో ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర ఏడాది పూర్తి కాగా ప్రజలతో మమేకమవుతూ..వారి సమస్యలు తెలుసుకుంటూ దిగ్విజయంగా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఏ పండగైనా, పుట్టిన రోజు వేడుకలైనా ప్రజల మధ్యే.
2019వ నూతన సంవత్సరం కూడా వైయస్‌జగన్ ప్రజల మధ్యే జరుపుకున్నారు. జననేత 335వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం పలాస నియోజకవర్గం, వంకులూరు క్రాస్ నుంచి ప్రారంభించారు. దెప్పూరు గ్రామం వద్ద జననేత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దెప్పూరు శివారులో వైయస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైయస్ జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు దారి పొడవునా ప్రజలు పోటీ పడుతున్నారు. వారందరికీ అభివాదం చేస్తూ, భరోసా నిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు.