వైయస్‌ఆర్ సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది
తాడేపల్లి: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు అవసరం లేదని వైయస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైయస్‌ఆర్ సీపీతో పొత్తుపెట్టుకోవాలని చాలా పార్టీలు అనుకోవచ్చు కానీ, వైయస్‌ఆర్ సీపీ ఎందుకు అనుకుంటుంది..? ఒంటరిగా పోటీ చేయాలన్నదే సీఎం వైయస్ జగన్ సిద్ధాంతమని సజ్జల రామకృష్ణారెడ్డి పునరుద్ఘాటించారు. వైయస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఎలాంటి పొత్తులకైనా సైద్ధాంతికంగా వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నారంటే అది సీఎం వైయస్ జగన్ మాత్రమేనని సజ్జల గుర్తుచేశారు. ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి తప్ప.. అధికారం కోసం పదిమంది కలిసి.. ప్రజల మీద సవారీ చేయడం, పబ్బం గడుపుకోవాలనే రాజకీయాలకు వైయస్ జగన్ వ్యతిరేకమన్నారు. ప్రజల ఆశీస్సులు పొంది.. అధికారంలోకి రావాలనేది సీఎం వైయస్ జగన్ ఆలోచన అని చెప్పారు. పొత్తులకు వైయస్‌ఆర్ సీపీ వ్యతిరేకమన్నారు.
ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ దేశంలోనే పేరుందని, 2019లో వైయస్‌ఆర్ సీపీతో కలిసి పనిచేశారని, ఇప్పుడు ఎలాంటి సేవలు అందించడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైయస్ జగన్‌కు, ప్రశాంత్‌కిషోర్‌కు వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉందన్నారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ వైయస్‌ఆర్ సీపీకి ఎలాంటి సేవలు అందించడం లేదని, భవిష్యత్తులో కూడా పీకే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పనిచేసే అవకాశాలు ఉండకపోవచ్చని సజ్జల అభిప్రాయపడ్డారు.
రేపు టీడీపీ ఆందోళనలకు పిలుపునివ్వడం హాస్యాస్పదమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఇంకా తామే అధికారంలో ఉన్నామని, టీడీపీ హయాంలో ఎలాగైతే అత్యాచారాలు, అన్యాయాలు, దారుణాలు, అక్రమాలు జరిగాయో.. ఇప్పుడు అలాగే ఉన్నాయని భ్రమపడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల ఆకాంక్షలకు తగినట్టే బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారన్నారు. ఎవరూ అడగకుండానే దిశ చట్టం తీసుకువచ్చారని గుర్తుచేశారు. సాధికారత దిశగా మహిళ అంటే పెద్దపీట వేసి కుటుంబ యజమానురాలిగా తీర్చిదిద్దిన ఘనత వైయస్ జగన్ ప్రభుత్వానిదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
రాష్ట్రంలో జరిగే ఘోరాలు టీడీపీ వారే ఏమైనా చేయిస్తున్నారా అనేది అనుమానాలు వస్తున్నాయని, పోలీస్ కంప్లయింట్ కూడా రిజిస్టర్ కాకముందే లోకేష్, చంద్రబాబు స్పందిస్తున్న తీరు చూస్తుంటే వారే చేయిస్తున్నారనే అనుమానం కలుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.