అనంతపురంలో అధ్వాన్నంగా తాగునీటి సరఫరా

1 Mar, 2017 18:06 IST

అనంతపురం: నగరంలో తాగునీటి సరఫరా అధ్వాన్నంగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి మండిపడ్డారు. నగరంలోకి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్లు, మీడియా ప్రతినిధులతో బుధవారం ముద్దాలపురం వాటర్‌ ఫిల్టర్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో గుర్నాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనంతపురం నగర కార్పొరేషన్‌ ఏర్పాటై మూడేళ్లు పూర్తయినా ప్రజలకు సక్రమంగా తాగునీరు సరఫరా చేయడం లేదని ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నగరంలో గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం ద్వారా పర్యటిస్తే..ఏ ఇంటికి వెళ్లినా మంచినీటి సమస్యపైనే ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. నగరంలో తీవ్రంగా తాగునీటి సమస్య ఉన్నా అధికారులు..పాలకవర్గం పట్టించుకోవడం లేదన్నారు. నగర కార్పొరేషన్‌ విడుదల చేసే నీటిని ఎవరు ఉపయోగించడం లేదని, సక్రమంగా నీటిని శుద్ధి చేయడం లేదని ఆరోపించారు. నీటి శుద్ధి ఏవిధంగా జరుగుతుందో ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఇకనైనా నగర కార్పొరేషన్‌ అధికారులు స్పందించి నీటి సరఫరాపై  చర్యలు తీసుకోవాలని గుర్నాథ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.