హిందూ దేవాలయాల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం

10 Jan, 2026 14:29 IST

విజయవాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాలు, హిందూ ధర్మంపై వరుస దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి వేల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. దాక్షారామంలో కాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసానికి వ్యతిరేకంగా హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా వేల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, దేవాలయాల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి రోజున ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. భక్తులు దేవాలయాలకు వెళ్తే సురక్షితంగా తిరిగి వస్తారనే నమ్మకం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.తిరుమల తిరుపతి దేవస్థానం గోపురంపైకి ఓ తాగుబోతు ఎక్కడం, భద్రత ఎంత దయనీయంగా ఉందో తెలియజేస్తోందన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో సుమారు 45 దేవాలయాలు ధ్వంసం చేయబడితే, వాటిని వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి పునర్నిర్మించిందని స్పష్టం చేశారు. ఇంతటి ఘటనలు జరుగుతున్నా విశ్వ హిందూ పరిషత్‌, స్వామీజీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హిందూ ధర్మాన్ని రక్షించేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. హిందూ డిక్లరేషన్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు సనాతన ధర్మం కనబడట్లేదా? అని నిలదీశారు. ఈ ఘటనలపై పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం ఆశ్చర్యకరమన్నారు. త్వరలోనే హిందువులంతా కూటమి ప్రభుత్వంపై తిరగబడతారని హెచ్చరించారు.

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భక్తులకు ఎలాంటి రక్షణ లేదన్నారు. దాక్షారామంలో శివలింగాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ధ్వంసం చేయడం రాష్ట్రంలో జరిగిన ఘోర అపచారమని పేర్కొన్నారు. కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొమ్మిది మంది మృతి చెందడం, చిన్న తిరుపతిలో రెండు గోవులు చనిపోవడం వంటి ఘటనలపై ప్రభుత్వం స్పందించలేదన్నారు.

ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా పట్టించుకోలేదని, శ్రీ చక్ర అర్చన సమయంలో పాలలో పురుగులు రావడం ఎంతటి దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. తిరుమలలో ముక్కోటి ఏకాదశి రోజున టికెట్ల విషయంలో అధికారులు ఘోర అలసత్వం వహించారని విమర్శించారు.

విజయవాడ నది తీరాన చంద్రబాబు నాయుడు ఫ్రెంచి డాన్సులు వేయిస్తుంటే, పక్కనే ఉన్న అమ్మవారి దేవస్థానాన్ని కాపాడలేని పరిస్థితి ఉందన్నారు. అమరావతి ఆవకాయ ఫెస్టివల్ పేరుతో రూ.5 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. దేవాలయ భూముల విషయంలో ఎండోమెంట్ శాఖలో దోపిడీ జరుగుతోందని, దేవాలయ భూములను ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం జీఓలు తెస్తోందని మల్లాది విష్ణు విమర్శించారు.

ఈ సందర్భంగా అమ్మవారి దేవస్థానంలో పాలలో పురుగులు రావడంపై సమగ్ర విచారణ చేపట్టాలని, శివలింగం ధ్వంసానికి పాల్పడిన వారిపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ హిందూ ధర్మ పరిరక్షణను మీటింగ్‌లకే పరిమితం చేసిందని, రాష్ట్రంలో భక్తులు, గోవులు చనిపోతుంటే బీజేపీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. త్వరలోనే ‘చలో అంతర్వేది’ కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమంలో శివలింగానికి దయానంద దత్త స్వామి, కోటీశ్వరూప నంద స్వామి, మాజీ మంత్రి వేల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వివిధ హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు ప్రత్యేక అభిషేకం చేశారు.