ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

14 Jul, 2016 12:47 IST
గడపగడపలో ఒకే నినాదం
వైయస్సార్సీపీకి విశేష ఆదరణ
టీడీపీపై మండిపడుతున్న ప్రజలు
వైయస్ జగన్ ను గెలిపించుకుంటామని ధీమా

కాకినాడ :  ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై ఏ సమస్యా పరిష్కారానికి నోచుకోని నేపధ్యంలో  ప్రజల మధ్యకు వెళ్తున్న పార్టీ నేతలకు మంచి స్పందన కనిపిస్తోంది. గడపగడకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా  తమ గోడు వినేందుకు వచ్చిన వైయస్సార్సీపీ నేతలకు ప్ర‌జ‌లు త‌మ‌ సమస్యలు విన్నవిస్తున్నారు. రెండేళ్ళుగా పడుతున్న కష్టాలు తెలియజేస్తున్నారు. ఓ వైపు ప్రజా సమస్యలు వింటూ మరో వైపు  మీ వెంటే మేమున్నామంటూ భరోసానిస్తూ పార్టీ నేతలు ముందుకు సాగిపోతున్నారు.  కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గురజనాపల్లిలో జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు గడపగడపలో పర్యటించారు. 

ఈ సందర్భంగా స్థానిక వృద్ధురాలు తాతపూడి వెంకాయమ్మ భర్తకు పింఛన్ వచ్చేదని, ఆయన మరణించి ఆరు నెలలైనా తనకు వితంతు పింఛన్ రావడంలేదంటూ వాపోయింది. హౌసింగ్‌లోన్ కోసం నాయకుల దగ్గరకు వెళ్తే మీరు ఎవరికి ఓట్లు వేశారో వారినే అడగండంటూ ఈసడించుకుంటున్నారని మల్లమ్మ వాపోయింది. ఉపాధి హామీ పథకంలో కొంతమందికే పనులు చెబుతున్నారని, పార్టీ పేరుతో వివక్ష చూపుతున్నారని గ్రామ ప్రజలు బాధను వ్యక్తం చేశారు. 

అలరిస్తున్న ప్రజా బ్యాలెట్...
అమలాపురం రూరల్ భట్నవిల్లిలో గడపగడపకూ వైయస్సార్సీపీ కార్యక్రమాన్ని పార్టీ సీఈసీ సభ్యుడు, కో-ఆర్డినేటర్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వరూప్,  సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి పార్టీ రూపొందించిన ప్రజాబ్యాలెట్‌ను ప్రజలకు అందించి టీడీపీ సర్కార్ వైఫల్యాలను వివరించారు.

జన్మభూమిని అడ్డుకోండి...
అనపర్తి నియోజకవర్గం శహపురం గ్రామంలో నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి గడపగడపలో పర్యటించారు. పింఛన్ కోసం ఏడాదిగా తిరుగుతున్నా జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుపడుతున్నారంటూ  మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షా 20 వేలు రుణానికిగాను కేవలం రూ.2వేలు మాత్రమే రుణ బకాయి ప్రభుత్వం చెల్లించిందని రాయుడు గోవిందు అనే రైతు నేతల దృష్టికి తీసుకొచ్చాడు. జ‌గ‌నన్న వ‌స్తారు మా క‌ష్టాల‌ను తీరుస్తార‌నే ఆశ‌తో ఉన్నామ‌ని లేదంటే ఎప్పుడో ఆత్మ‌హ‌త్య చేసుకునేవారిమ‌ని గ్రామ‌స్తులు త‌మ‌గోడును వ్య‌క్తం చేశారు.