ప్రజల సొమ్ముతో బాబు విహారయాత్రలు
విశాఖః సంక్షేమాన్ని విస్మరించి ప్రజాసొమ్ముతో చంద్రబాబు విదేశాల‌్లో విహారయాత్రలు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గ సమన్వయక్త బొడ్డేడ ప్రసాద్ విమర్శించారు. అర్హులైన పేద, మధ్యతరగతి ప్రజానికానికి పెన్షన్లు కూడా అందించడం లేదని మండిపడ్డారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని రాంబిల్లి మండలం వాడనర్సాపురం గ్రామంలో బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు ప్రజావ్యతిరేక పరిపాలనను ఎండగట్టారు. ఎన్నికల్లో వందల కొద్ది హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.