కనీస మౌలిక సదుపాయాలు కరువు
కర్నూలు: గ‌్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయని వైయస్ఆర్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా శేషారెడ్డి అన్నారు. వెలుగోడు పట్టణంలో గురువారం ఆయన గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. అన్ని అర్హతలు ఉన్నా పింఛన్లు మంజూరు చేయడం లేదని, రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని వాపోయారు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయడం లేదని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. అంతర్గత రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, మంచినీరు సక్రమంగా పంపిణీ చేయడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా శేషారెడ్డి మాట్లాడుతూ..అధికార పార్టీ నేతలు అభివృద్ధి పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని, ప్రజా సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. పక్కనే వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉన్నా మంచినీటి సమస్య తీరడం లేదని ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారాని పోరాటం చేస్తానని, మరో రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం వస్తుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు అంబాల ప్రభాకర్‌రెడ్డి, ఇలియాస్‌ఖాన్, ముంతల విజయభాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.