కౌరవులను తలపించిన పార్లమెంటు సభలు
లోక్‌సభ, రాజ్యసభ కౌరవ సభలుగా తయారైపోయి తెలుగుజాతిని అవమానించాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. అన్ని వ్యవస్థలనూ దిగజార్చి, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ చేతిలో చెయ్యేసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖండఖండాలుగా నరికేశాయని ఆగ్రహం వ్యక్తంచేసింది. రాష్ట్ర విభజన విషయంలో లోక్‌సభ, రాజ్యసభ వ్యవహరించిన తీరు చూస్తుంటే దేశంలో అసలు ప్రజాస్వామ్యం బతికే ఉందా? నిలువునా హత్య చేశారా? అనే అనుమానం కలుగుతోందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
బీజేపీ వెంకయ్య నాయుడు రాజ్యసభలో బిల్లుకు సవరణలు సూచించినట్లు, ప్రభుత్వం వాటికి అంగీకరించినట్లు డ్రామాను బాగా రక్తి కట్టించారని పద్మ విమర్శించారు. విభజనకు వ్యతిరేకంగా సీపీఎంతో పాటు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు గళం విప్పితే, మన రాష్ట్రానికే చెందిన ప్రాంతీయ పార్టీ టీడీపీ మాత్రం కాంగ్రెస్ అడుగులకు మడుగులు ఒత్తిందని దుయ్యబట్టారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ విభజనకు వ్యతిరేకంగా ప్లకార్డు ప్రదర్శిస్తే, ఆ పక్కనే టీడీపీకే చెందిన గుండు సుధారాణి విభజనకు అనుకూలంగా ప్లకార్డు ప్రదర్శించడం దేనికి సంకేతం అని నిలదీశారు. ఒకే పార్టీకి చెందిన సభ్యులు ఇలా తెలుగుజాతి పరువును బజారుకు ఈడ్చారని వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.