ఉద్య‌మంపై ఉక్కుపాదం

10 Apr, 2018 09:27 IST


- హోదా పోరాటాన్ని నీరుగార్చేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం
- ర‌హ‌దారుల దిగ్బంధాన్ని అడ్డుకుంటున్న పోలీసులు
- వైయ‌స్ఆర్‌ సీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌
అమ‌రావ‌తి :  ఐదు కోట్ల మంది ప్ర‌జ‌ల ఆకాంక్ష అయిన ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే అధికార పార్టీ ఉక్కుపాదంతో అణచివేసేందుకు కుట్ర‌లు చేస్తోంది. నాలుగేళ్ల పాటు ప్ర‌త్యేక హోదా పేరెత్త‌ని చంద్ర‌బాబు ఇటీవ‌ల యూట‌ర్న్ తీసుకున్నా..ఆయ‌న నిర్ణ‌యంలో చిత్త‌శుద్ధి క‌రువైంది. ఒక‌వైపు త‌న ఎంపీలు ఢిల్లీలో పోరాటం చేస్తున్న‌ట్లు మీడియాలో లీకులు ఇస్తున్నారే త‌ప్ప‌..హోదా సాధ‌న‌కు ఉద్య‌మిస్తున్న నాయ‌కులపై అక్ర‌మ కేసులు బ‌నాయించి అరెస్టు చేయిస్తున్నారు. ఇప్ప‌టికే వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌లో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌ల‌కు  దిగారు. ముగ్గురు ఎంపీలు తీవ్ర అస్వ‌స్థ‌త‌త‌కు గురై ఆసుప‌త్రిలోనూ దీక్ష కొన‌సాగిస్తున్నారు. మ‌రోవైపు ఎంపీ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిల ఆరోగ్యం క్షీణిస్తున్నా..లెక్క చేయ‌కుండా దీక్ష కొన‌సాగిస్తున్నారు. ఎంపీల దీక్ష‌కు సంఘీభావంగా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ‌ జాతీయ రహదారులను దిగ్బంధం కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది. అయితే చంద్ర‌బాబు త‌నకు ఉన్న అధికారాల‌తో పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌ను ముందుస్తుగా అరెస్టులు చేయిస్తూ ఉద్య‌మాన్ని నీరుగార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఉద‌యం  కడప-చెన్నై రహదారిలో వాహనాల రాకపోకలను రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. మరోవైపు కృష్ణా జిల్లా జాతీయ రహదారుల దిగ్బంధనానికి సిద్ధమవుతున్న నందిగామ పార్టీ నేతలను పోలీసులు హౌజ్‌ అరెస్టు చేశారు. హౌజ్‌ అరెస్టు అయిన వారిలో పార్టీ సమన్వయకర్త మొండితోక జగన్‌తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు ఉన్నారు. చంద్ర‌బాబు తీరును అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నారు.