అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

13 Apr, 2014 20:00 IST
హైదరాబాద్, 13 ఏప్రిల్ 2014:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసింది. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోని సువర్ణయుగాన్ని తీసుకురావడమే ప్రధాన ధ్యేయంగా తాము కృషి చేస్తామని పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి వివరించారు. లోటస్‌పాండ్‌లోని క్యాంపు కార్యాలయంలో శ్రీ జగన్‌ ఆదివారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విడివిడిగా విడుదల చేశారు. మేనిఫెస్టోలోని అంశాలు గత నాలుగేళ్ళుగా తాము హామీ ఇస్తున్నవే అని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వం ఏయే పథకాలు అమలు చేస్తుందనే విషయాలను మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. అవినీతికి తావు లేని పారదర్శకమైన పరిపాలన అందిస్తామన్నారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే.. పేదోడికి భరోసాగా పరిపాలన కొనసాగిస్తామన్నారు.

పదవుల కోసం తాను రాజకీయాల్లోకి రావడంలేదని, ప్రజలకు మంచి పనులు చేసి, మరణించిన తరువాత కూడా ప్రతి ఇంటిలో మహానేత వైయస్ఆర్‌ ఫోటో పక్కన తన ఫోటో ఉండాలన్న సదాశయంతో ముందుకు వస్తున్నానని శ్రీ జగన్‌ తెలిపారు. రాష్ట్రానికి స్వర్ణయుగం అందించింది దివంగత మహానేత వైయస్ రాజశేఖ‌రరెడ్డి అని శ్రీ జగన్ చెప్పారు. పేదల గుండె చప్పుడే వైయస్ఆర్‌సీపీ మేనిఫెస్టోగా రూపొందించామన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే  మహానేత వైయస్ఆర్‌ స్ఫూర్తితో పరిపాలన కొనసాగిస్తానన్నారు. రాష్ట్రంలోని 20 వేల పంచాయతీల్లో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

మీడియాను మేనేజ్ చేయడంలో‌ చంద్రబాబు నాయుడు దిట్ట అని శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు చేసింది తక్కువ ప్రచారం చేసుకున్నది ఎక్కువని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలు ఎలా దిగజారిపోయాయో.. మహానేత రాజశేఖరరెడ్డి పాలనలో ఎలా పరుగులు తీశాయో బేరీజు వేసి శ్రీ జగన్ వివరించారు.‌ చంద్రబాబు హయాంలో వృద్ధి రేటు 5.7 శాతం ఉంటే.. దివంగత మహానేత పాలనలో 9.6 శాతం నమోదైందని ఆయన చెప్పారు. రాజశేఖరరెడ్డి మరణించాక వృద్ధి రేటు మళ్లీ దిగజారిందని తెలిపారు. ఇవన్నీ దివంగత మహానేత సువర్ణయుగానికి దిక్సూచి అని చెప్పారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ సాధించలేని అభివృద్ధి వైయస్ఆర్ చేసి చూపించారని పేర్కొన్నారు. చంద్రబాబు, వై‌యస్ఆర్ పాలనల్లో వ్యవసాయం, ఐటీ, పారిశ్రామిక తదితర రంగాల్లో ఎలా అభివృద్ధి చెందింది.. ఇరువురి పాలనలో వ్యత్యాసాలను బేరీజు వేసి గణాంకాలతో సహా‌ శ్రీ జగన్ వివరించారు. చంద్రబాబు తన హయాంలో ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాల మాదిరి టీడీపీ నాయకులకు పంచిపెట్టారని ఉదాహరణలతో సహా వివరించారు. పారిశ్రామిక సంస్థలను ఎవరెవరికి దారాదత్తం చేసి పేర్లతో సహా వెల్లడించారు.

రాష్ట్రం మూడున్న కోట్ల ఉద్యోగాలిస్తానని చంద్రబాబు పగటిపూటే అబద్ధాలు చెబుతున్నారని శ్రీ జగన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. లక్షా 2౭ వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు దొంగ హామీలిస్తున్న చంద్రబాబు రైతులకు కనీసం వడ్డీ కూడా మాఫీ చేయని ఘనుడని ఎద్దేవా చేశారు. తన తొమ్మిదేళ్ళ పాలనలో రైతుల రుణాలు ఆయన ఎందుకు మాఫీ చేయలేదని నిలదీశారు. చంద్రబాబు హయాంలో 65 ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేయగా, 26 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని శ్రీ జగన్‌ గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో పచ్చ చొక్కాలకే అంతా దోచిపెట్టారని విమర్శించారు. మరో ఐదేళ్ళు చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డున పడి ఉండేవారన్నారు.

‌వర్షాలు, వరదలు లాంటి పకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను ఆదుకునేందుకు రూ. 2 వేల కోట్లతో 'కెలామిటీ ఫండ్'ను ఏర్పాటు చేస్తామన్నారు. రైతన్నల పంటలకు సరైన ధర వచ్చేందుకు వీలుగా రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతామన్నారు. రాజన్న రాజ్యంలో వ్యవసాయంలో మంచి మార్పులు తీసుకువస్తామన్నారు. ప్రతి రెండు జిల్లాలకూ ఒక వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేస్తామని, రాష్ట్రం మొత్తంలో మూడు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నెలకొల్పుతామన్నారు. ప్రతి జిల్లాలోనూ ఫుడ్‌ ప్రాసెసింగ్‌, స్టోరేజ్‌, ప్యాకేజ్ యూనిట్‌ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో పెట్రోల్‌ వర్శిటీ తీసుకువస్తామని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామన్నారు. ఉత్పాదకత రంగంలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చూస్తామన్నారు. చదువుకున్న ప్రతి విద్యార్థికీ ఉద్యోగం వచ్చేలా ప్రయత్నం చేస్తానన్నారు.

డ్వాక్రా మహిళలకు రుణ విధానంలో మార్పులు తీసుకువస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు రూ. 20 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు. వృద్ధుల పింఛన్‌ను రూ. 200 నుంచి రూ. 700కు పెంచుతామన్నారు. పింఛన్‌కు అర్హత వయస్సును ఇప్పుడున్న 65 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకు తగ్గిస్తామని చెప్పారు. అమ్మ ఒడి పథకం కింద ఒక్కొక్క విద్యార్థికీ రూ. 500 చొప్పున ఇద్దరికి వారి తల్లి బ్యాంకు ఖాతాలో మొత్తం రూ. 1000 నెలనెలా జమచేస్తామన్నారు. లబ్ధిదారులకు ఏ కార్డయినా 24 గంటల్లో అందేలా చేస్తామన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్‌ను పగటిపూటే అందిస్తామన్నారు. రాజన్నరాజ్యంలో ప్రతి ఏడాది 10 వేల ఇళ్ళు నిర్మించి పేదలకు ఇస్తామని, వాటికి పూర్తి హక్కులతో పత్రాలు అందజేస్తామన్నారు. పేదలకు అవసరమైనప్పుడు ఆ ఇంటిపై పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేలా బ్యాంకులతో సంప్రదిస్తామన్నారు.

ఆరోగ్యశ్రీలో సమూల మార్పులు చేసి మరింత పకడ్బందీగా అమలు చేస్తామని పార్టీ మేనిఫెస్టోలో శ్రీ జగన్‌ భరోసా ఇచ్చారు. వంట గ్యాస్‌ సిలిండర్‌పై ఇప్పుడిస్తున్న సబ్సిడీని రూ. 50 నుంచి రూ. 100 కు పెంచుతామన్నారు. ‌పేదలకు నెలకు రూ. 100కే 150 యూనిట్ల విద్యుత్ వినియోగించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో ఒక కమిషన్‌ వేసి దాని నివేదిక ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ రెగ్యులరైజ్‌ చేస్తామన్నారు. ప్రతి ఉద్యోగికీ పక్కా ఇల్లు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల చేతిలోనే పంచాయతీ పాలన ఉండేలా చేస్తామన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చేస్తామన్నారు. సోషల్‌ ఆడిట్‌ మహిళల చేతుల్లో పెడతామన్నారు. ప్రతి జిల్లాకు ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నెలకొల్పుతామని మేనిఫెస్టోలో తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక వృద్ధాశ్రమం, ఒక అనాథాశ్రమం నెలకొల్పుతామన్నారు.

ప్రతి జిల్లాలో ఒక శీతల గిడ్డంగిని ఏర్పాటు చేస్తామని శ్రీ జగన్‌ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని ఒక గార్డెన్‌సిటీగా రూపొందిస్తామన్నారు. ఆ నగరాన్ని రోడ్లు, పచ్చదనం విషయంలో మోడల్‌సిటీగీ తీర్చిదిద్దుతామన్నారు. కొత్త రాజధానిలో అన్ని సౌకర్యాలూ కల్పించి ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలోనే అత్యున్నతంగా ఉన్న మల్టీ నేషనల్‌ సంస్థలను ఆహ్వానించి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పారు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ కారిడార్‌ ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీకాకుళం నుంచి చెన్నై, బెంగళూరులకు నాలుగు లైన్ల కారిడార్లు ఏర్పాటు చేసి వాటిని ప్రతి జిల్లాతో అనుసంధానం చేస్తామన్నారు. ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం, ఒక విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. పోలవరంను గొప్ప ప్రాజెక్టుగా నిర్మిస్తామన్నారు.

గడచిన నాలుగేళ్లుగా తాను రాష్ట్రం నలువైపులా పర్యటించానని, గ్రామాల్లో ఎన్నో పేద గుడిసెలను చూశానని, పేదల కష్టాల గురించి తాను విన్నది, చూసినదే మేనిఫెస్టోలో చేర్చామని శ్రీ జగన్ చెప్పారు. ప్రజల కష్టాలను తాను ప్రత్యక్షంగా చూశానని, వారి సమస్యలను తీర్చడమే అజెండాగా మేనిఫెస్టో రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ ‌నాయకులు డీఏ సోమయాజులు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మైసూరారెడ్డి, కొణతాల రామకృష్ణ, నల్లా సూర్యప్రకాశ్, గట్టు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.