ఐఎంజి భూకుంభకోణంపై విచారణ జరిపించాలి
ఐఎంజి భారత భూ కుంభకోణానికి సంబంధించిన నిజానిజాలు వెలుగులోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై శాసనసభా కమిటీ ద్వారా గాని, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో గానీ విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన 850 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకు ఓ అనామక సంస్థకు కట్టబెట్టేసిన వైనాన్ని వారు ఎత్తిచూపారు. సుమారు 8,500 కోట్ల రూపాయల విలువైన ఆ భూమిని ఎకరాకు కేవలం రూ.50 వేలకే కట్టబెట్టారని అనామకులైన అహోబలరావు అనే బిల్లీరావు, ప్రభాకరరావు అనే పేట్రావు భాగస్వాములుగా ఉన్న అనామక సంస్థ ఐఎంజికి ఈ ఖరీదైన భూములను చంద్రబాబు అప్పనంగా కట్టబెట్టేశారని పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు.
తన మీద ఉన్న అవినీతి ఆరోపణలపై విచారణ జరగకుండా చేసుకోవడానికే చంద్రబాబు నాయుడు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి అడుగడుగునా వత్తాసు పలుకుతున్నారని భూమన ఆరోపించారు. చంద్రబాబుకు నిజాయితీ ఉంటే స్వయంగా ముందుకు వచ్చి విచారణకు సిద్ధపడాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయిన టిడిపి తనపై విచారణ జరగకుండా చంద్రబాబు మేనేజ్ చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉన్నప్పుడు ఐఎంజిపై విచారణ జరగాలని పట్టుపట్టి హడావుడి చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు సిఎంగా ఉండి కూడా ఆ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని భూమన కరుణాకరరెడ్డి నిలదీశారు. ఈ విషయంలో చంద్రబాబు - కిరణ్ కుమార్‌రెడ్డి మధ్య ఉన్న అక్రమం సంబంధం ప్రజలందరికీ సుస్పష్టం అయిందన్నారు.
చంద్రబాబుకు సిగ్గూ, ఎగ్గూ ఉంటే.. ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే.. సచ్ఛీలుడివే అయితే.. నిజాయితీపరుడివే అయితే.. ఐఎంజికి తాను కేటాయించిన భూ భాగోతంపై ఆయనే ముందుకు వచ్చి విచారణకు సిద్ధం కావాలని భూమన సవాల్ చేశారు. ఐఎంజి భూ కుంభకోణంపై న్యాయవిచారణ జరిపించాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చినట్లు భూమన తెలిపారు.
'ఐఎంజి కుంభకోణంపై విచారణ జరపాలి' అనే నినాదాలు రాసిన ప్లకార్డులను వైయస్‌ఆర్ కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రదర్శించారు. పార్టీ ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, కాపు రామచంద్రారెడ్డి, జి. శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, గొల్ల బాబూరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శించారు.