అన్ని డివిజన్లలో వైఎస్సార్సీపీ పోటీ

12 Dec, 2015 18:42 IST
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి చిరునామా వైఎస్. రాజశేఖర్ రెడ్డి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుతాం
టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయంః శివకుమార్


హైదరాబాద్ః గ్రేటర్ హైదరాబాద్ లోని  అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ వైఎస్సార్సీపీ నేతలు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి చిరునామా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి రాజన్న ఎంతో కృషిచేశారని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లలో వైఎస్సార్సీపీ బరిలో నిలుస్తుందని... హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నేతలు తెలిపారు. గ్రేటర్ లో రాజన్న చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. 

హెచ్ఎండీఏ ఆవిర్భావం, దేశంలోనే అతిపెద్ద ఔటర్ రింగ్ రోడ్డు, రూ. 16 కోట్లతో మెట్రో రైలు ప్రారంభించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  శివకుమార్ తెలిపారు. ఐదేళ్లలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో పాటు పీవీ నర్సింహారావు హైవే, నగరానికి కృష్ణాగోదావరి జలాలను తీసుకొచ్చి నగర ప్రజల అవసరాలను తీర్చిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని స్పష్టం చేశారు.  గ్రేటర్ లో ఓట్లు అడిగే అర్హత ఒక్క వైఎస్సార్సీపీకి మాత్రమే ఉందన్నారు. మిగిలిన రాజకీయ పార్టీల కళ్లబొల్లి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని శివకుమార్ చెప్పారు. రాబోయే రోజుల్లో గ్రేటర్ లో అన్ని స్థానాల్లోనూ సత్తా చాటుతామన్నారు. 

గోదావరి జలాలు మీమే తెచ్చామని , మెట్రో రైలు మేమే చేపట్టామని టీఆర్ఎస్ చెప్పుకోవడం దారుణమన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలోనే మెట్రోకు పునాది పడిందన్నారు. హైదరాబాద్ లో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఉన్నా..మెట్రో రైలు 2,3 కి.మీ. కూడా నడపలేని పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కేసీఆర్ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందన్నారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటు వైఎస్సార్సీపీకి వేసి గెలిపించాలని నేతలు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ లో అత్యధిక స్థానాలను గెలుచుకొని నగర ప్రజల సమస్యలపై పోరాడుతామన్నారు.  ఈఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పడం ఖాయమన్నారు.