అవనిగడ్డలో వైయస్ఆర్ కాంగ్రెస్ పోటీ లేదు
29 Jul, 2013 16:19 IST
విజయవాడ, 29 జూలై 2013:
దివంగత ఎమ్మెల్యే అంబటి బ్రహ్మణయ్య కుటుంబం మీద ఉన్న గౌరవంతోనే అవనిగడ్డ ఉప ఎన్నికలో తమ పార్టీ పోటీ చేయకూడదని నిర్ణయించినట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, నాయకుడు వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. చంద్రబాబు నాయుడు లేఖ రాసినందుకే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిని పోటీలోకి దించడం లేదన్న వాదనలో వాస్తవం లేదని వారు స్పష్టం చేశారు. 2009లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే కొర్ల రేవతీపతి మరణించినప్పుడు ఆ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో టిడిపి తరఫున అభ్యర్థిని పోటీలో పెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మానవతా విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఉదయభాను, రాధాకృష్ణ విమర్శించారు. రాజకీయాల్లో విలువలు పాటించని స్వార్థ నాయకుడు చంద్రబాబు అని వారు వ్యాఖ్యానించారు.