తెలుగుతల్లి విగ్రహం వద్ద ఎమ్మెల్యేల నిరసన
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టారు. విభజన ఆగాలంటే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా సచివాలయం వద్ద గల తెలుగు తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి అక్కడినుంచి అసెంబ్లీ వరకు పాదయాత్రగా బయల్దేరారు. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద ప్రజాప్రతినిధులు ధర్నా చేపట్టారు. ర్యాలీకి అనుమతి లేదంటూ వారిని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో వైఎస్ఆర్ సీపీ నేతలు ఫ్లకార్డులతో నిరసనకు దిగారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులకు సంఘీభావం తెలిపేందుకు తెలుగుతల్లి విగ్రహం దగ్గరికి భారీగా చేరుకున్న పార్టీ అభిమానులు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.