19న రాజధానిలో సమైక్య శంఖారావం

1 Oct, 2013 16:53 IST
హైదరాబాద్ 01 అక్టోబర్ 2013:

సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనెల 19న రాష్ట్ర రాజధానిలో భారీ బహిరంగ సభను తలపెట్టింది. సోమవారం పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సభ నిర్వహించే తేదీని మంగళవారం పార్టీ వెల్లడించింది. పార్టీ ప్రధాన  కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ తేదీతో పాటు చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలను ప్రకటించారు.

గాంధీ జయంతి,  లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నాడైన అక్టోబర్ 2వ తేదీనుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నిర్దిష్ట కార్యక్రమాలను చేపట్టనున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ వెల్లడించారు. అహింసా సిద్ధాంతంతో మహాత్మా గాంధీ, జై జవాన్ జై కిసాన్ నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారనీ, వారే స్ఫూర్తిగా తమ పార్టీ సమైక్యాంధ్ర ప్రదేశ్ సాధనకు శాంతియుతంగా  ఆందోళన కార్యక్రమాలను చేపట్టనుందనీ ఆయన చెప్పారు. ఈ అంశాన్ని పార్టీ విస్తృత సమావేశంలోనే నిర్ణయించినట్లు తెలిపారు.

పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరేలా వీటిని చేపట్టాలని నిర్ణయించామన్నారు. బుధవారంనాడు సీమాంధ్రలోని 13 జిల్లాలోని 175 నియోజకవర్గాలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నిరాహార దీక్షలు చేసి ఆందోళన కార్యక్రమాలను ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ ఒకటో తేదీ వరకూ ఆందోళన కార్యక్రమాలను కొనసాగించాలని తలపెట్టామని తెలిపారు. సమైక్యవాదులంతా ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రాజీనామాలు ఇవ్వని ఎమ్మెల్యేల వద్దకు ఈ నెల 7న వెళ్ళి, రాజీనామాలు చేసి సమైక్యవాదానికి మద్దతు తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తామన్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటుచేసి సమైక్య తీర్మానం చేసేందుకు వీలుగా వత్తిడి తేవాలని కూడా కోరతామని చెప్పారు. పదో తేదీన అన్ని మండల కేంద్రాలలో రైతు సోదరులతో దీక్షలు చేపడతామన్నారు. రాష్ట్రం విడిపోతే ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయనే విషయమై వివరిస్తామన్నారు. 17న అన్ని నియోజకవర్గ కేంద్రాలలో రిక్షాలు, ఆటోలతో కార్మికలు ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. 21న అన్ని నియోజకవర్గ కేంద్రాలలో మహిళలతో మానవ హారాలు నిర్మిస్తామని తెలిపారు. 24న మోటార్ సైకిల్ ర్యాలీలు, 26న అన్ని జిల్లాల్లో సర్పంచులు, సర్పంచి అభ్యర్థులు ఒక రోజునిరాహార దీక్ష చేపట్టాలని కోరారు. 29న విద్యార్థులతో ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. నవంబరు ఒకటిన అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించాలనీ, పంచాయతీ సమావేశాలు ఏర్పాటు చేసి సమైక్య రాష్ట్రం కోరుతూ తీర్మానం చేయాలనీ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో తలపెట్టిన సమైక్య శంఖారావం సభను విజయవంతం చేయాలని సమైక్య వాదులకు కొణతాల పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. సమైక్యంగా ఉంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో వివరించిన విషయాన్ని కొణతాల జ్ఞాపకం చేశారు. వేర్పాటువాదాన్ని కోరుకుంటున్న వారు కూడా ఈ సభకు సహకరించాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ప్రజలకు వివరించడానికి అవకాశం ఉంది కాబట్టి హైదారాబాద్‌లోనే సభ పెట్టాల్సిన అవసరముందని శ్రీ జగన్మోహన్ రెడ్డి భావించారని చెప్పారు. అలాగే విభజన కోరుకునే వారు సీమాంధ్రలో సభ పెట్టుకోవచ్చని ఆయన సూచించారు.

షర్మిల వ్యాఖ్యలకు వక్రీకరణ తగదు
మానుకోట ఘటన దురదృష్టకరమైనదనీ, దాని వెనుక ఎవరున్నదీ అందరికీ తెలుసనీ కొణతాల ఓ ప్రశ్నకు చెప్పారు. హైదరాబాద్ నగరంపై శ్రీమతి షర్మిల చేసిన వ్యాఖ్యలను వక్రీకరించ తగదని టీఆర్ఎస్ నేతలకు ఆయన హితవు పలికారు. మన హైదరాబాద్ అంటే పాకిస్థాన్ కాదనీ, మన రాజధానికి నగరానికి వెళ్లాలంటే అడ్డుపెట్టి, ఆటంకపరిచే హక్కు ఎవరికీ లేదనీ చెప్పడం ఆమె ఉద్దేశమని వివరించారు. మీ వేర్పాటు వాదాన్ని వినిపించాలనుకుంటే మీరు కూడా తిరుపతి, హైదరాబాద్, తదితర నగరాల్లో సభలు పెట్టుకోవచ్చని కొణతాల కేసీఆర్‌కు సూచించారు. అందుకు మేము సహకరిస్తామన్నారు. విభజన ప్రాతిపదికగా పెట్టిన పార్టీ కాబట్టి, అక్కడ కూడా మీ వాదాన్ని వినిపించుకోవాలని కోరారు. ఇరువురి వాదనలూ విని ఎవరిది ప్రజలు అంగీకరిస్తారో చూద్దామన్నారు. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కాబట్టి ఎవరైనా ఇక్కడ సభలు పెట్టుకోవచ్చన్నారు. అందరం కలిసి ఉన్నాం కాబట్టే హైదరాబాద్ నగరానికి ఇన్ని కీర్తి ప్రతిష్టలు వచ్చాయని కొణతాల పేర్కొన్నారు.