బాబును సీఎం కుర్చీ నుంచి దించితేనే మంచి రోజులు

23 Nov, 2017 18:14 IST



- బాబు సీఎం అయ్యాక అన్నీ గోవిందా..గోవిందా
– మహానేత ముఖ్యమంత్రి కాగానే రైతులకు ఉచిత విద్యుత్‌ 
–పెరిగిన గ్యాస్‌ ధరలు వైయస్‌ఆర్‌ భరించారు
– చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మన ఖర్మ
– ఈ నాలుగేళ్లలో మూడు సార్లు కరెంటు, ఆర్టీసీ చార్జీలు పెంచారు
– భూములు లాక్కునే పరిపాలన సాగుతోంది
– ప్రత్యేక హోదాను గాలికొదిలేశాడు.∙ 
–  సంక్షేమ హాస్టళ్లను మూసి వేస్తున్నారు
– పిల్ల కాల్వలు తవ్వించలేని స్థితిలో టీడీపీ పాలన
–  ప్రజలకు భరోసా ఇవ్వడానికే ప్రజా సంకల్ప యాత్ర 

కర్నూలు: మళ్లీ మంచి రోజులు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీలో నుంచి దిగిపోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. గత తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ఇదే జరిగిందని, ఆయన సీఎంగా ఉన్న రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని, దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రం అభివృద్ధి చెందిందని వైయస్‌ జగన్‌ వివరించారు. మళ్లీ మన ఖర్మ కొద్ది చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ప్రజా సంక్షేమ పథకాల బరువు తగ్గిందని, దారుణమైన పాలన సాగుతుందని మండిపడ్డారు. బాబు సీఎం కుర్చీ నుంచి దిగిపోతేనే మంచి రోజులు వస్తాయని తెలిపారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకే తాను ప్రజా సంకల్ప యాత్ర చేపట్టానని, అందరూ మద్దతుగా నిలబడి మీ ముద్దు బిడ్డను ఆశీర్వదించాలని వైయస్‌ జగన్‌ కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గురువారం సాయంత్రం వెల్దుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ చంద్రబాబు నాలుగేళ్ల పాలనను ఎండగట్టారు. మహానేత పాలనను గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..

– మీ అందరి ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు, ఆప్యాయతలకు పేరు పేరుకు కృతజ్ఞతలు.
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనను చూసి ఇవాళ ప్రజలు విసుగెత్తిపోయారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఓ వ్యక్తి తాను చెప్పని అబద్ధం లేకుండా ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేస్తూ..హామీలిచ్చి ఆ తరువాత ఎవరిని కూడా వదలిపెట్టకుండా చంద్రబాబు అందరిని మోసం చేశాడు. 
–నాలుగేళ్ల ఈ పాలనను చూసిన  తరువాత నేను అడుగుతున్నాను. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబే చెప్పారు. ఈ సంవత్సరం తరువాత మనకు ఎలాంటి నాయకుడు కావాలని మన మనసాక్షిని అడగాలి.మోసం చేసే నాయకత్వం మనకు కావాలా? అబద్ధాలు చెప్పే నాయకత్వం మనకు కావాలా? 
–ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజమైన నాయకుడు కావాలి. అప్పుడే ఈ రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలుస్తుంది. లేదంటే ముఖ్యమంత్రి పదవి కోసం ఏదంటే అది చెప్పి ప్రజలను మోసం చేస్తారు. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి.
– చంద్రబాబు పాలన చూస్తుంటే నాకు ఒక్కటే గుర్తుకు వస్తుంది. మన రాష్ట్రంలోని బడుల్లో చిన్న పిల్లలు ఆడుకునేందుకు బడిలో ఒక పెద్ద బల్ల ఉంటుంది. ఒక వైపు ఒకరు, మరోవైపు ఇంకోకరు కూర్చుంటారు. బరువు ఎక్కువ ఉన్నా వారు కిందకి వెళ్తారు. బరువు తక్కువ ఉన్నా వారు పైకి లేస్తారు. త్రాసు కూడా అంతే..చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి కూర్చీలో కూర్చోంటే పేదలకు అందే సబ్సిడీ, సంక్షేమ పథకాలు అన్ని కూడా బరువు తగ్గిపోయి గాలిలో వేలాడుతున్నాయి. మళ్లీ చంద్రబాబును సీఎం కూర్చీ నుంచి దించితే అన్నీ కూడా బ్రహ్మండంగా ఉంటాయి.
– గతంలో 9 ఏళ్లు  సీఎంగా పనిచేసిన చంద్రబాబు పాలనలో అందాక ఉన్న మద్య నిషేదం గోవిందా, సబ్సిడీ బియ్యం గోవిందా, ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా గోవిందా, వ్యవసాయం గోవిందా, వర్షాలు గోవిందా, సీఎం కుర్చీ కూర్చున్న వెంటనే ఇళ్ల నిర్మాణం గోవిందా..అన్ని గోవిందా గోవిందా.