మోసగాడిని ఎలా నమ్మాలి?

27 Mar, 2018 18:21 IST
– కేసీఆర్‌కు ఉన్నది చంద్రబాబుకు లేనిది రోషం
– బాబు పాలనలో ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు
– పత్తి కొనుగోళ్లలో పంది కొక్కుల్లా జిల్లా మంత్రులే తింటున్నారు
– సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు దళారీ అయ్యారు
– అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు
– ప్రత్యేక హోదా గురించి అడగకపోవడం దుర్మార్గం కాదా బాబూ?
– పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామా
– టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకపోతే బాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు 
– వెన్నుపోటు పొడవటం చంద్రబాబు రక్తంలోనే ఉంది
 
గుంటూరు: చంద్రబాబుకు నాలుగేళ్ల తరువాత అఖిలపక్షం గుర్తుకు వచ్చిందా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ఏ ఒక్క హామీ అమలు చేయని మోసగాడు చంద్రబాబు నోట అఖిలపక్షం మాట రావడం ఆశ్చర్యంగా ఉందని, అయితే ఆయన్ను ఎలా నమ్మాలని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. హోదా కోసం ఇన్నాళ్లు తాము పోరాడితే ఉద్యమాన్ని అణచివేసిన వ్యక్తి ఇప్పుడు కొత్త డ్రామాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. ప్రజలను నమ్మించు..వంచించు..వెన్నుపోటు పొడిచి..ద్రోహం చేసి..ఆ నేరాన్ని వేరే వారిపై నెట్టేయాలి..అందుకు అనుకూలమీడియాను వాడుకోవడం కేంద్రంపై నెట్టేయడం..ఇక్కడేమో బీద అరుపులు అరవడం..ఇదే చంద్రబాబు రాజకీయ  సూత్రమని వైయస్‌ జగన్‌ వివరించారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని విమర్శించారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 121వ రోజు సత్తెనపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..

అన్నా..నీకు తోడుగా మేమంతా..
నాతో పాటు వేలాది మంది అడుగులు వేస్తున్నారు. ఒకవైపున వారికున్న కష్టాలను చెబుతూ..అర్జీలు ఇస్తూ..మరోవైపున మండుతున్న ఈ ఎండను ఏమాత్రం లెక్క చేయకుండా నా భుజాన్ని తడుతూ అన్నా..నీకు తోడుగా మేమంతా ఉన్నామని అడుగులో అడుగు వేస్తున్నారు. ఏ ఒక్కరికి ఈ ఎండలో నాతో పాటు నడవాల్సిన అవసరం లేదు. అయినా ఎండను ఖాతర్‌ చేయకుండా నడిరోడ్డుపై దుమ్ములో నడవాల్సిన అవసరంలేదు. చిక్కటి చిరునవ్వులతో అప్యాయతలు చూపుతున్నారు. ప్రేమానురాగాలు పంచుతున్నారు. ఆత్మీయతలు చూపుతున్నారు. మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు

వరి సాగుకు దూరమయ్యారు..
ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టగానే నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో సమస్యలు ఒక్కటే ఉన్నాయి. రైతులు అన్నా..నాగార్జున సాగర్‌ కుడికాల్వ ద్వారా మాకు నీళ్లు అందాలన్నా..140 టీఎంసీల నికర జలాలు మాకున్నాయి. కానీ మా ఖర్మ ఏంటి అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. వరి సాగు చేయడం లేదని చెబుతున్నారు. నాన్నగారి పాలనలో వరి పుష్కలంగా పండించేవారమని చెబుతున్నారు.  చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు..నాలుగేళ్లుగా వరి సాగుకు దూరమయ్యామని చెబుతున్నారు. నాగార్జున సాగర్‌లో 275 టీఎంసీల నీరు ఉన్నా కూడా కుడికాల్వకు నికల జలాల కేటాయింపులు ఉన్నా..వరి వేసుకోవడం లేదు. ఆ రైతులు నాతో మాట్లాడుతూ..అన్నా..మా ఖర్మ చూడండి..పక్కనే నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ తెలంగాణలో పోతుంది. అక్కడ ప్రతి ఏటా వరి సాగు చేస్తున్నారు. అక్కడ కేసీఆర్‌కు ఉన్నది ఏంటి? చంద్రబాబుకు లేదని ఏంటని రైతులు అడుగుతున్నారు. ఇక్కడ చంద్రబాబుకు లేనిది ఏంటో తెలుసా రోషం. కేసీఆర్‌ వద్ద చంద్రబాబుకు సంబం«ధించిన ఓటుకు కోట్లు కేసు ఆడియో, వీడియో టేపులు ఉన్నాయి. ఆ ఆడియో టేపుల్లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడంతో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారు. నాలుగేళ్లుగా రైతులు ఇవాళ అవస్థలు పడుతున్నారు. 

ఏ ఒక్క పంటకు మద్దతు ధర లేదు
నీళ్లు  ఇవ్వని కారణంగా మాగాణి భూముల్లో మెట్ట పంటలు వేసుకోవాల్సి వస్తోంది. కందులు, సుబాబులు, మినుములు వేసుకోవాల్సి వస్తోంది. మిర్చి, పత్తి పంటలకు దిగుబడి రావడం లేదు. వాటికి కనీస మద్దతు ధర లేదు. నాలుగేళ్లుగా ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని రైతులు అంటున్నారు.  ఒక్కసారి మీరంతా కూడా నాలుగేళ్ల కాలంలో ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా?పత్తి వేసుకుంటే కనీస మద్దతు ధర రూ.4420 ఉంటే, పత్తిని  టీడీపీ నేతలు పంది కొక్కుల్లా అవినీతికి పాల్పడ్డారు. మిర్చికి గిట్టుబాటు ధర లేదు.వ్యవసాయ రంగంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. ప్రతి రైతు నోట్లో నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తానే ఒక దళారి అయి మాకు రేటు రాకుండా చేస్తున్నారని అంటున్నారు. హెరిటేజ్‌ సంస్థ నుంచి రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. దళారుల వద్దకు సరుకు వెళ్లగానే ధరలకు రెక్కలొస్తున్నాయి.

జీఎస్టీ, టీఎస్టీతో పాటు ఒక్కట కేఎస్టీ కూడా..
రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ మోత అని బాధపడుతున్నారు. జీఎస్టీకి తోడుగా టీఎస్‌టీ ఉంది.టీఎస్టీ అంటే తెలుగు దేశం సర్వీస్‌ట్యాక్స్‌. జన్మభూమి నుంచి కాంట్రాక్టర్ల వరకు టీఎస్టీ వసూలు చేస్తున్నారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ రెండింటితో పాటు కేఎస్టీ మొదలుపెట్టారు. కేఎస్టీ అంటే కోడెల సర్వీస్‌ ట్యాక్స్‌ పెట్టారు. కాంట్రాక్టర్ల నుంచి మద్యం షాపులు, తోపుడు బండ్లు, అపార్ట్‌మెంట్లు కట్టాలన్నా ట్యాక్స్‌ చెల్లించాల్సిందే. కొత్త సినిమా రిలీజ్‌ కావాలన్నా ట్యాక్స్‌ కట్టాల్సిందే.  చంద్రబాబు పాలనలో అభివృద్ధి అంటారు. అందులో జీడీపీ ఏమేరకు పెరిగాయన్నది అన్ని అబద్ధాలు. లంచాలు మాత్రం త్రిబుల్‌ డిజిట్‌కు పెరిగాయి. ఈ నియోజకవర్గంలో నాలుగు రోడ్ల విస్తరణకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు రావడం లేదట. కారణం ఏంటో తెలుసా ఆ కాంట్రాక్టర్లు వీరికి లంచాలు ఇవ్వలేక ముందుకు రావడం లేదు. రైల్వే గేటుపై ఓవర్‌ బ్రిడ్జీ కట్టమని ఇక్కడి ప్రజలు అడుగుతూనే ఉన్నారు. పట్టించుకునే నాథుడు లేడు. ఇదే సత్తెనపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 2007లో ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఆ ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. రోడ్లు లేవు..మంచినీళ్లు లేవు.
– రాష్ట్రంలో ఏం జరుగుతుందని మీ అందరికి బాగా తెలుసు. టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతుంది. ఈ నాలుగేళ్లలో ఏరు దాటాకా తెప్ప తగిలేసిన చందంగా ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. రైతుల రుణాలు, పొదుపు రుణాల మాఫీలో మోసం, చదువుకుంటున్న పిల్లలకు మోసం, రైతులకు గిట్టుబాటు ధర రాకుండా దళారిగా మారి మోసం, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం, ఏ కులాన్ని వదలకుండా మోసం చేశారు. కాపులు, బోయలను మోసం చేశారు, రజకులు, కురువలు, మాదిగల వరకు అందరిని మోసం చేశారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మోసం..మోసం..అబద్ధాలు..అబద్ధాలు చూశాం.

ఇదే బాబు రాజకీయ సూత్రం..
నాలుగేళ్లలో చంద్రబాబును ప్రజలు నిలదీస్తుంటే ఆయన వెన్నులో వణుకు పుట్టింది. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తనకు బాగా తెలిసిన రాజకీయ సూత్రం ఒక్కటి ఉంది. దాన్ని ఎన్నికల సమయంలో బయటకు తీసుకువస్తారు. ప్రజలను నమ్మించు..వంచించు..వారికి ద్రోహం చేసి వెన్నుపోటు పొడుచు..ఆ తరువాత ఆ నెప్పాన్ని వేరే వారిపై నెట్టడం. దీని కోసం తన అనుకూల మీడియాను వాడుకోవడం. ఆరు నెలలుగా ఇదే చూస్తున్నాం. చంద్రబాబుకు కనిపించింది ఏంటో తెలుసా..ఏ నెపాన్ని తనపై వేసుకోకుండా కేంద్రంపై వేయడం, ఇక్కడేమో బీద ఏడుపులు ఏడ్చటం. చంద్రబాబు నోట్లో నుంచి కొన్ని మాటలు వస్తున్నాయి. చంద్రబాబును బలహీన పరడం అంటే రాష్ట్రాన్ని బలహీన పరచడమట. నిజంగా ఇదే చంద్రబాబు పాలన మీరంతా చూస్తున్నారు. ఒక సామెత కూడా చంద్రబాబు నైజంపై గుర్తుకు వస్తుంది. ఒ క దొంగ తప్పుడు పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడట. ఆయన్ను ప్రజలు, వ్యవస్థలు ప్రశ్నించడం మొదలుపెట్టారట. దీంతో ఆ దొంగ ఏమన్నారంటే నన్ను అరెస్టు చేస్తే ఈ ఊరు బలహీన పడుతుందన్నాడట. ఇదే కార్యక్రమాన్ని చంద్రబాబు చేస్తున్నారు.

దొంగే దొంగ..దొంగ అన్నట్లుగా ఉంది..
ఇదే పెద్ద మనిషి ప్రత్యేక హోదాపై అంటున్న మాటలు ఆశ్చర్యానికి గురి చేశాయి. ప్రత్యేక హోదాకు సంబంధించిన పోరాటం చేసేదాంట్లో ఆయన దశాదిశానిర్దేశం చేస్తారట. నాలుగేళ్ల తరువాత అఖిలపక్షాన్ని ఈ రోజు పిలుస్తాడట. దొంగతనం చేసేవారే దొంగ దొంగ అంటున్నాడు.  ఇవాళ అఖిల పక్షాన్ని పిలవాలని గుర్తుకు వచ్చిందా చంద్రబాబు. నాలుగేళ్ల క్రితం రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఆ నాటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వమని ప్లానింగ్‌ కమిషన్‌కు సిఫార్స్‌ చేసింది. చంద్రబాబు సీఎం అయిన 7 నెలల పాటు ఆ ఆదేశాలు ప్లానింగ్‌ కమిషన్‌లో ఉన్నాయి. ఆ ఏడు నెలలు చంద్రబాబు గాడిదలు కాశాడా?అడక్కపోవడం దుర్మార్గం కాదా? 

ఆ రోజే నీ మంత్రులను ఉపసంహరించుకుని ఉంటే..
అయ్యా..చంద్రబాబు 2016 సెప్టెంబర్‌ 8న అరుణ్‌జైట్లీ అర్ధరాత్రి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పారు. అదే అర్ధరాత్రి చంద్రబాబు అరుణ్‌జైట్లీకి కృతజ్ఞతలు తెలిపారు. మరుసటి రోజు అసెంబ్లీలో తీర్మానం చేశారు. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని అన్నారు. ఇటీవల అరుణ్‌జైట్లీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు నాటి స్టేట్‌మెంట్‌కు తేడా ఏముందని అడుగుతున్నాను. ఆరోజు శాలువాలతో సన్మానించావు. ఈ రోజు నీ మంత్రులను ఎందుకు ఉపసంహరించుకున్నావు. ఆ రోజే నీ మంత్రులను ఉపసంహరించుకుని ఉంటే ఈ పాటి ప్రత్యేక హోదా వచ్చి ఉండేది కాదా?ఇది అన్యాయం కాదా?
– నాలుగేళ్లుగా ఇదే పెద్దమనిషి చేసింది ఏంటీ? ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేస్తే మోడీ వస్తున్నారని ప్రతిపక్ష నాయకుడి దీక్షలను భగ్నం చేసింది వాస్తవం కాదా? బంద్‌లు చేస్తే బలవంతంగా బస్సులు నడిపించింది వాస్తవం కాదా?ధర్నాలు చేస్తే దగ్గరుండి కే సులు పెట్టించావు. యువభేరిలు నిర్వహిస్తే పిల్లలపై పీడీ యాక్ట్‌ పెడతామని బెదిరించిన ఘనత నీది కాదా చంద్రబాబు? నాలుగేళ్లుగా చేసింది ఇది కాదా?


ఊసరవెళ్లి కన్నా స్పీడ్‌గా రంగులు మార్చి..
 మార్చి 16న వైయస్‌ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టకపోయి ఉంటే నీవు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టేవాడివా? సంఖ్యబలం ఉంటే అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తానని చెప్పారు. మరుసటి రోజే చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ప్రతి పార్టీని కలిసి మద్దతు కూడగట్టారని, అదంతా పేపర్లలో వచ్చింది కాబట్టి ఈ పెద్ద మనిషి వెంటనే యూటర్న్‌ తీసుకున్నారు. సంఖ్యాబలం ఉంటే మద్దతిస్తానన్న ఈ పెద్ద మనిషి తానే అవిశ్వాస తీర్మానం పెడుతున్నానని చెప్పుకున్నారన్నారు. ఊసరవెళ్లి కన్నా స్పీడ్‌గా రంగులు మార్చి తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడం వాస్తవం కాదా?

– ఈ రోజు చంద్రబాబు పూటకో మాట మార్చుతూ..రోజుకో వేషం వేస్తున్నారు. ఈ రోజు అఖిలపక్షం ఏర్పాటు చేస్తారట. ఆయన్ను ఎలా నమ్మాలి. కారణం చంద్రబాబుకు చిత్తశుద్ది లేదు. ఆయన రక్తంలోనే వెన్నుపోటు పొడిచే గుణం ఉంది. మేం ఇప్పటికే కార్యాచరణ ప్రకటించాం. ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా కోసం నినదిస్తున్నారు కాబట్టి నీవు మనసు మార్చుకున్నారు. ఇవాళ దేశం మొత్తం రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. నీవు చరిత్రహీనుడిగా మిగలకుండా ఉండాలంటే వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలి. మొత్తం ఎంపీలు రాజీనామాలు చేస్తే దేశం మొత్తం చర్చించుకుంటుంది. ప్రత్యేక హోదా తనంతకు తానే వస్తుంది. నీ పార్టీకి చెందిన ఎంపీలు కూడా పార్లమెంట్‌ చివరి రోజు స్పీకర్‌ పార్మెంట్‌లో రాజీనామాలు చేయాలని చంద్రబాబుకు పిలుపునిస్తున్నారు.


అబద్ధాలు, మోసాలు, అన్యాయం, అవినీతి..
నాలుగేళ్లుగా అబద్ధాలు, మోసాలు, అన్యాయం, అవినీతితో కూడిన నాలుగు స్తంభాల పాలన చూశాం. నాలుగేళ్ల పాలన అయిపోయింది. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి కాబట్టి మీకు ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచన చేయండి. మోసాలు చేసేవారు నాయకుడు కావాలా? అబద్ధాలు చెప్పేవారు నాయకులు కావాలా?ఇలాంటి అబద్ధాలు చెప్పేవారిని పొరపాటున క్షమిస్తే రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలుసా? చంద్రబాబు మీ వద్దకు వస్తారు. మీరు చిన్న చిన్న అబద్ధాలకు నమ్మరని పెద్ద పెద్ద అబద్ధాలు చెబుతారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. నమ్ముతారా అన్నా..నమ్మరు కాబట్టి దానికి బోనస్‌గా ప్రతి ఇంటికి బెంజి కారు ఇస్తానంటారు. నమ్మరు అని చంద్రబాబుకు తెలుసు కాబట్టి ఏం చేస్తారో తెలుసా? ప్రతి ఇంటికి మనిషిని పంపించి ప్రతి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. డబ్బు ఇస్తే మాత్రం వద్దు అనకండి..రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబులో నుంచి దోచేసిన డబ్బే అదంతా..అబద్ధాలు చెప్పే వారిని, మోసాలు చెప్పే వారిని బంగాళఖాతంలో కలిపే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. అందుకు మీ అందరి తోడు కావాలి.

మనందరి ప్రభుత్వం వచ్చాక..
రేపు పొద్దున మనందరి ప్రభుత్వం వచ్చాన ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడాలని నవరత్నాలు ప్రకటించాను. ప్రతి మీటింగ్‌లోనూ నవరత్నాల గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవాళ అక్కచెల్లెమ్మల గురించి నవరత్నాలలో నుంచి చెబుతున్నాను.  రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి అక్క, చెల్లెమ్మకు తోడుగా ఉంటాను. నాడు చంద్రబాబు పొదపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పడంతో ఆయన మాటలు నమ్మి రుణాలు కట్టకుండా పోయారు. ఈ నాలుగేళ్ల కాలంలో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా? పైగా చంద్రబాబు చేసిన అన్యాయం ఏంటో తెలుసా? గత ప్రభుత్వాలు అన్నీ కూడా పొదుపు సంఘాలకు సున్నా వడ్డీలకే రుణాలు ఇచ్చేవారు. ఆ ప్రభుత్వాలు వడ్డీ డబ్బులు బ్యాంకులకు కట్టేవారు. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తరువాత పొదుపు సంఘాలకు, రైతులకు సంబంధించిన వడ్డీ డబ్బులు బ్యాంకులకు కట్టడం మానేశారు. ఎవరికి కూడా బ్యాంకులు వడ్డీ లేకుండా డబ్బులు ఇవ్వడం లేదు. రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతైతే పొదుపు సంఘాలకు అప్పులు ఉంటాయో..ఆ మొత్తం అప్పులు నాలుగు ధపాలుగా నేరుగా అక్కాచెల్లమ్మల చేతులకు  ఇస్తామని మాట ఇస్తున్నాను. అంతేకాదు వారికి ఇంకా ఏం మేలు చేస్తానంటే మళ్లీ సున్నా వడ్డీ రుణాలకు శ్రీకారం చుడతాం. వడ్డీ డబ్బులు బ్యాంకులకు పూర్తిగా కడుతాం. దీని వల్ల ఆ అక్కా చెల్లెమ్మలు నాన్నగారు కలలు కన్న స్వప్నం ప్రతి ఒక్క మహిళా లక్షాధికారి కావాలి.

అక్కా చెల్లెమ్మలకు భరోసా కల్పిస్తా
 చంద్రబాబు ఎన్నికలకు ముందు పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తానని చెప్పారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఒక్క ఇల్లైనా కట్టించాడా? ఒక్కసారి నాన్నగారి పాలన గుర్తుకు తెచ్చుకోండి. ఆ రోజుల్లో దేశం మొత్తం మీదా 48 లక్షల ఇల్లు కడితే..ఉమ్మడి ఏపీలో 48 లక్షల ఇల్లు కట్టించి దేశంతో పోటీ పడ్డారు. ప్రతి పేదవాడికి ఇల్లు అందిన పాలన మనమంతా చూశాం. ఇవాళ ప్రతి అక్కా, చెల్లెమ్మలకు హామీ ఇస్తున్నాను. మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తాను. ఆ ఇల్లు అక్కా చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తాం. కారణం ఒక్కసారి అక్కచెల్లెమ్మలకు అస్తిగా ఆ ఇల్లు వస్తుంది. రేపు పొద్దున డబ్బులు అవసరమైతే ఆ ఇంటిపై బ్యాంకులో రుణం పొందే వీలు కల్పిస్తాను. పావలా వడ్డీకే రుణం ఇప్పిస్తాం. దీని వల్ల ఆ అక్కా చెల్లెమ్మలకు అసరాగా ఉంటుంది. భరోసా ఉంటుంది.  నవరత్నాల్లోని మిగిలిన అంశాలను ముందు ముందు చెబుతాను. ఇందులో ఏదైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే నేను ఎక్కడ ఉన్నానో మీ అందరికి తెలుసు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, తోడుగా ఉండమని మీ అందరిని కోరతున్నాను. చెరగని చిరునవ్వుతో నాపై ప్రేమానురాగాలు చూపిన మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను..