పోరాట యోధుడు@2016

31 Dec, 2016 13:31 IST
–ప్ర‌తిప‌క్షం.. ప్ర‌తిక్షణం ప్ర‌జాప‌క్షం
– సర్కార్‌పై వైయస్‌ జగన్‌  అలుపెరగని పోరాటం
– బాబు హామీలు అమలు చేయాలని దీక్షలు..ధర్నాలు
– హోదా సాధన కోసం యువభేరి సదస్సులు
– రైతులకు..మహిళలకు..నిరుద్యోగులకు అండగా నిలిచిన జననేత
– ‘గడప గడపకూ’ వెళ్లిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. అరాచకం రాజ్యమేలుతోంది. దోచుకోవడం..దాచుకోవడంపైనే అధికార పార్టీ నేతలు దృష్టి పెట్టారు. అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అడ్డదారిలో అధికారంలోకి వచ్చారు. మూడేళ్లు అవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా దిగజారుడు రాజకీయాలు చేస్తూ ప్రజలను దగా చేశారు. ఇలాంటి సమయంలో నేనున్నానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజల పక్షాన నిలబడ్డారు. టీడీపీ నిరంకుశ పాలనకు అడ్డుపడ్డారు. బాధితులకు అండగా నిలిచారు. ప్రజల తరపున పోరాటం చేశారు. 2016వ సంవత్సరంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటాలపై ప్రత్యేక కథనం. 
==============
జనవరి నెల
==============
జనవరి 1: ప్రభుత్వం తలపెట్టిన 3వ విడత జన్మభూమిలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీయాలని ప్రజలకు వైయస్‌ఆర్‌సీపీ పిలుపు. గత రెండు విడతల్లో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం చూపాలని డిమాండ్‌.
 
జనవరి 2: వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా ఓడిపోయిన టీడీపీ నేతలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా జీవో జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వైయస్‌ జగన్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలాంటి జీవోలు రాజ్యాంగ విరుద్ధమని ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు.

జనవరి 3: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌ జిల్లాలో వైయస్‌ షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభం. బ్రహ్మరథం పట్టిన తెలంగాణవాసులు.

జనవరి 6: సినీ దర్శకుడు దాసరి నారాయణ రావుతో వైయస్‌ జగన్‌ భేటీ. వైయస్‌ జగన్‌ పోరాటాలను కొనియాడిన దాసరి. భవిష్యత్‌ వైయస్‌ జగన్‌దేనని కితాబు

జనవరి6: అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు, చేనేత కుటుంబాలకు వైయస్‌ జగన్‌ పరామర్శ. 4వ విడత రైతు భరోసా యాత్ర ప్రారంభం.
 
జనవరి 8: తెలంగాణలో ముగిసిన వైయస్‌ షర్మిల పరామర్శ యాత్ర. ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆత్మబంధువులను కలుసుకున్నామన్న షర్మిలమ్మ.

జనవరి 11: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలుపై వైయస్‌ జగన్‌ ఆందోళన. ఈ పథకంలో మార్పులు తెస్తామని అనంతపురం రైతు భరోసా యాత్రలో వైయస్‌ జగన్‌ హామీ.  
 
జనవరి 11: చిత్తూరు జిల్లాలో గడువు తీరిన చంద్రన్న కానుక పంపిణీ.  మరోసారి బయటపడిన టీడీపీ మోసం. మంత్రి సాక్షిగా నిరూపించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.

జనవరి 12: అనంతపురం జిల్లాలో ముగిసిన వైయస్‌ జగన్‌ 4వ విడత రైతు భరోసాయాత్ర. 28 కుటుంబాలకు పరామర్శ. అండగా ఉంటానని ప్రతిపక్ష నేత హామీ.

జనవరి 12: రోజా సస్పెన్షన్‌ రాజ్యాంగ విరుద్ధమని శాసన సభ స్పీకర్‌ కోడెలకు వైయస్‌ జగన్‌ లేఖ..తక్షణమే సస్పెన్షన్‌ ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి.

జనవరి 18: ఏపీలో అప్రజాస్వామిక పాలన. యథేచ్చగా అధికార పార్టీ అణచివేత చర్యలు. ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టుపై చర్చ జరుగుతుండగానే రైతులకు మద్దతు తెలిపిన నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సమైక్యాంధ్ర ఉద్యమ కేసులో చెవిరెడ్డి అరెస్టు.

జనవరి 19: హెచ్‌సీయూ విద్యార్థిని రోహిత్‌ ఆత్మహత్యపై వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి. రోహిత్‌ కుటుంబానికి వైయస్‌ జగన్‌ పరామర్శ. విద్యార్థులపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని హెచ్‌సీయూ వీసీకి వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి.  
 
జనవరి 19 : నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్లలో రైతుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అరెస్టుపై వైయస్‌ఆర్‌సీపీ ఆగ్రహం. ప్రభుత్వ తీరును ఖండించిన వాసిరెడ్డి పద్మ. 

జనవరి 20: హెచ్‌సీయూ విద్యార్థుల ఆమరణ దీక్షకు వైయస్‌ జగన్‌ మద్దతు.  వీసీ పరిష్కరించాల్సిన సమస్యలో కేంద్ర మంత్రుల జోక్యమేమిటీ? సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులపై వెంటనే సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌. 

జనవరి 21: నెల్లూరు జైలులో ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీకాళహస్తి నేత మధుసూదన్‌రెడ్డిలకు వైయస్‌ జగన్‌ పరామర్శ. టీడీపీ పాలన బ్రిటిష్‌ పాలనకంటే దారుణంగా ఉందని వైయస్‌ జగన్‌ ఫైర్‌. 

 జనవరి 24: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం తీరును ఖండించిన వైయస్‌ఆర్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. అమరావతిపై హక్కులన్నీ సింగపూర్‌కేనా? అని సూటి ప్రశ్న

జనవరి 26: వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. 67 ఏళ్లయినా దళితుల స్థితిగతులు మారలేదని ఆవేదన. రాజ్యాంగ స్ఫూర్తి నీరుగారుతూ ఉండటం విచారకరమన్నారు.

 జనవరి 27: కాకినాడలో మాజీ మంత్రి తనయుడు ముత్తా శశిధర్, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక. మోసగాడి పాలనపై ఐక్యంగా పోరాడుదామని వైయస్‌ జగన్‌ పిలుపు.  

జనవరి 27: ప్రత్యేక హోదా సాధన కోసం కాకినాడలో వైయస్‌ జగన్‌ ఆధ్వర్యంలో యువభేరి.
 
జనవరి 29: పులివెందులలో వైయస్‌ జగన్‌ పర్యటన. ఆరోగ్యమిత్రలకు అండగా నిలుస్తామని హామీ.
 
జనవరి 30:  వైయస్‌ఆర్‌ జిల్లా వేంపల్లి మండలంలో  వైయస్‌ జగన్‌ పర్యటన.
రైతులు, డ్వాక్రా మహిళలు, ఉద్యోగులను నిలువునా వంచిందని ఫైర్‌.  చిరుద్యోగులను తొలగిస్తూ పచ్చచొక్కాలతో భర్తీ చేయాలని చూస్తోందని ఆగ్రహం. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందే పరిస్థితి లేదు. ఓపిక పట్టండి..ప్రజల ప్రభుత్వం వస్తుందని భరోసా.l
==============
ఫిబ్రవరి నెల
============
ఫిబ్రవరి1: చంద్రబాబు కాపులకిచ్చిన హామీలు అమలు చేయకుండా, వారిపై అక్రమ కేసులు బనాయించడాన్ని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఖండించారు. తుని ఘటనలో పులివెందుల రౌడీలన్న బాబు వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత తిప్పికొట్టారు. ఇచ్చిన హామీలు అమలు చేయని బాబే క్రిమినల్‌ నంబర్‌ వన్‌. వంగవీటి రంగాను హత్య చేయించింది బాబే అని మీడియా సమావేశంలో వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.  

ఫిబ్రవరి 2: కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ఆత్మబలిదానం చేసుకున్న వెంకట రమణ మూర్తి కుటుంబాన్ని వైయస్‌ జగన్‌ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి..ఓదార్పునిచ్చారు.

 ఫిబ్రవరి 2: శ్రీకాకుళం జిల్లాలో వైయస్‌ జగన్‌ అధ్వర్యంలో యువభేరి. హోదా ఆవశ్యకతపై విద్యార్థులు, యువతను చైతన్యవంతం చేసిన ప్రతిపక్ష నేత.  ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఓ హైదరాబాద్‌ అవుతుందని వెల్లడి.

ఫిబ్రవరి5: కాపులపై బైండోవర్‌ కేసుల నమోదు చేసిన ప్రభుత్వం. తీవ్రంగా ఖండించిన వైయస్‌ఆర్‌సీపీ. బీసీలను రెచ్చగొడుతూ.. కాపుల నుంచి బైండోవర్లు తీసుకోవడం నిలిపేయాలని బొత్స సత్యనారాయణ డిమాండ్‌
 
ఫిబ్రవరి11: గుంటూరు జిల్లాలో వైయస్‌ జగన్‌ పర్యటన. చిరుమామిళ్ల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే దొడ్డా బాలకోటిరెడ్డి విగ్రహం ఆవిష్కరణ. వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూతురు వివాహానికి హాజరైన జననేత.

ఫిబ్రవరి11: సస్పెన్షన్‌పై హైకోర్టులో రోజా పిటిషన్‌. స్పీకర్‌ పరిధి దాటి వ్యవహరించారని వెల్లడి.  స్పీకర్‌ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ కొట్టేయాలని అభ్యర్థన.

 ఫిబ్రవరి13: శ్రీకాకుళం జిల్లా పర్యటనలో వైయస్‌ జగన్‌ పర్యటన. వంశధార నిర్వాసితులకు అండగా ఆందోళన.  బాబు లాంటి మోసగాడు దేశంలో లేడని వైయస్‌ జగన్‌ ఫైర్‌.

ఫిబ్రవరి15: విజయవాడ రామవరప్పాడు రోడ్డు బాధితులకు వైయస్‌ జగన్‌ భరోసా. తమ ఇళ్లు కూల్చేశారని విలపించిన మహిళలు, మసీదు కూడా కూలుస్తామంటున్నారని ఆవేదన. బాధితులకు అండగా పోరాడతామని వైయస్‌ జగన్‌ హామీ.

ఫిబ్రవరి16: భారత్‌ ఆర్మీ జవాన్‌ ముస్తాక్‌ అంత్యక్రియల్లో పాల్గొన్న వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌. అమర జవాన్‌ స్వగ్రామైన కర్నూలు జిల్లా పార్నపల్లెలో కుటుంబ సభ్యులకు ప్రతిపక్ష నేత పరామర్శ.
  
ఫిబ్రవరి17: పార్టీ ఫిరాయింపులపై గవర్నర్‌కు వైయస్‌ జగన్‌ ఫిర్యాదు. బాబూ..ధైర్యముంటే ప్రభుత్వాన్ని రద్దు చెయ్‌ అంటూ సవాల్‌. 
ఫిబ్రవరి17: వైయస్‌ఆర్‌సీపీలోకి ఆనం విజయకుమార్‌రెడ్డి. వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన ఆనం సోదరుడు. ఆయన అనుచరులు.

ఫిబ్రవరి18: విశాఖ శారదాపీఠం వార్షికోత్సవ ముగింపు వేడుకలకు హాజరైన వైయస్‌ జగన్‌. మహాకుంభాభిషేకంలో పాల్గొన్న ప్రతిపక్ష నేత.

ఫిబ్రవరి 23: ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిసిన వైయస్‌ జగన్‌. ఎమ్మెల్యేల ప్రలోభాలపై రాష్ట్రపతికి వైయస్‌ జగన్‌ ఫిర్యాదు.  

 ఫిబ్రవరి25:  వైయస్‌ఆర్‌ జిల్లా కడప పెద్ద దర్గాలో వైయస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు. సిగ్గు, లజ్జ, దమ్మూ, ధైర్యం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని, ప్రజాతీర్పునే రెఫరెండంగా స్వీకరిద్దామని చంద్రబాబుకు చాలెంజ్‌ విసిరిన వైయస్‌ జగన్‌

ఫిబ్రవరి 24: ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌తో వైయస్‌ జగన్‌ భేటీ. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని వినతి. ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి.

===================
మార్చి
============
మార్చి 5: పార్టీ ఫిరాయింపులకు నిరసనగా నల్లకండువాలతో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల ప్రదర్శన. ప్రకాశం పంతులు విగ్రహం నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి విపక్ష సభ్యులు. అవినీతి సొమ్ముతో ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తున్నారని సీఎంపై జగన్‌ ధ్వజం

మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శాసనసభలో వాడిగా చర్చ. మహిళలపై వేధింపులే మీ ఘనత అంటూ వైయస్‌ జగన్‌ ఆగ్రహం.

మార్చి 9: భూ దురాక్రమణపై అసెంబ్లీలో చర్చ. అసలు నిందితుడివి నీవ్వే అంటూ బాబుపై ధ్వజం. సీబీఐ విచారణకు సిద్ధమా? అంటూ వైయస్‌ జగన్‌ సవాల్‌.

మార్చి 10: రాష్ట్ర బడ్జెట్‌పై వైయస్‌ జగన్‌ ప్రసంగం. అంతా అభూత కల్పనలే అంటూ ఆగ్రహం.

మార్చి 11: వైయస్‌ఆర్‌సీపీ ఐదేళ్ల ప్రస్థానం. వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో  ఘనంగా వేడుకలు. 

మార్చి 15: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ తీరును వైయస్‌ జగన్‌ ఖండించారు. మీరు స్పీకరా..టీడీపీ ఎమ్మెల్యేనా? అంటూ నిలదీత.  రాజ్యాగస్ఫూర్తికి విరుద్ధగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపణ. పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత డిమాండ్‌.

మార్చి 17: రోజా సస్పెన్షన్‌ చెల్లదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఆ తీర్మానం సభ నిబంధనలకు విరుద్ధమని ప్రకటన.  

మార్చి 19: రోజా సస్పెన్షన్‌ విషయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను లెక్క చేయని ప్రభుత్వం. ఎమ్మెల్యే రోజాను రెండో రోజు కూడా అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్న మార్షల్స్‌.  న్యాయవ్యవస్థపై సర్కార్‌ ధిక్కారానికి విపక్షం నిరసన..అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం.

మార్చి 23: నెల్లూరు బహిరంగ సభలో ఆనం విజయకుమార్‌రెడ్డి వైయస్‌ఆర్‌సీపీలో చేరిక. ఆ రోజున నేను, అమ్మే ..నాయకులెవరూ లేరంటూ వైయస్‌ జగన్‌ ప్రసంగం.     

మార్చి 26: లోటు పేరుతో లూటీ చేశారని అసెంబ్లీలో వైయస్‌ జగన్‌ ప్రసంగం. ప్రభుత్వ అవినీతిని ఎండగట్టిన ప్రతిపక్ష నేత. 

మార్చి 30: పట్టిసీమ పేరుతో రూ.1600 కోట్లు నీటిపాలు చేశారని వైయస్‌ జగన్‌ ఆగ్రహం.  సీఎం చంద్రబాబుపై సభలో వైయస్‌ జగన్‌ నిప్పులు. 180 టీఎంసీల కృష్ణాడెల్టాను 4 టీఎంసీలతో కాపాడరట. బాబు ఔట్‌డేటెడ్‌ అని ఆయన ప్రసంగమే చెబుతోందని ఎద్దేవా.
==================
ఏప్రిల్‌
============
ఏప్రిల్‌7:  ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌లో మీరెల సమర్థించుకుంటారని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూటి ప్రశ్న.  రాష్ట్రప్రభుత్వానికి, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ.

ఏప్రిల్‌14: విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్‌ సాధన కోసం వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ దీక్ష.  మద్దతు తెలిపిన వైయస్‌ జగన్‌. రైల్వే జోన్‌ వచ్చేదాకా పోరాటం చేస్తామని హెచ్చరిక.

ఏప్రిల్‌23: చంద్రబాబు అనైతిక రాజకీయాలకు వ్యతిరేకంగా  ‘సేవ్‌ డెమోక్రసీ’ పేరుతో ఉద్యమం. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లకు ఫిర్యాదు. పార్టీ ఫిరాయింపులను ఖండించిన వైయస్‌ జగన్‌. 
============
మే
============
మే2: మాచర్లలో వైయస్‌ జగన్‌ కరువు ధర్నా. ప్రభుత్వంపై పెల్లుబికిన ప్రజాగ్రహం. వైయస్‌ జగన్‌కు అడుగడుగునా నీరాజనం

మే3: తిరగబడ్డ రాజధాని రైతులు. చంద్రబాబు, మంత్రి నారాయణ రాజధాని కోసం ఏమిచ్చారంటూ నిలదీత. పేద రైతుల భూములే కావాల్సి వచ్చాయా అంటూ ఆందోళన. సమాధానం చెప్పలేక గ్రామ సభను వాయిదా వేసిన అధికారులు

మే4: విశాఖ జిల్లాలోని బ్రాండిక్స్‌ కార్మికుల పోరాటానికి వైయస్‌ జగన్‌ మద్దతు. కార్మికుల వేధింపులపై ప్రతిపక్ష నేత ఫైర్‌. వేధింపులు ఆపకపోతే తానే ఆందోళనకు దిగుతానని వైయస్‌ జగన్‌ హెచ్చరిక.  

మే7: హంద్రీ–నీవా నీటిని జిల్లాకివ్వకుండా కుప్పానికి తరలించడాన్ని నిరసిస్తూ వైయస్‌ఆర్‌సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి జల జాగరణ దీక్ష చేపట్టారు. మా నీటిని తరలిస్తే ఊరుకోమని బాబుకు ఎమ్మెల్యే హెచ్చరిక.  

మే9: పులివెందుల, లింగాల మండలాల్లో ప్రతిపక్ష నేత పర్యటన. అకాల వర్షాలతో నష్టపోయిన అరటి తోటల పరిశీలన. ప్రభుత్వం ఆదుకుంటుదనే నమ్మకం లేదని బాబుపై వైయస్‌ జగన్‌ ధ్వజం

మే 10: ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌ కార్యాలయాల ఎదుట వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు. కాకినాడ కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న వైయస్‌ జగన్‌. హోదాపై కేంద్రానికి అల్టిమేటం ఇవ్వగలవా? అని చంద్రబాబుకు సవాల్‌.

 మే 16: కర్నూలు నగరంలో వైయస్‌ జగన్‌ జలదీక్ష. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులతో ఏపీ ఎడారిగా మారుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అంటూ ఆగ్రహం. అక్రమ ప్రాజెక్టులతో నీటి యుద్ధాలు జరుగుతున్నాయని ఆందోళన.    

మే 27: గుంటూరు జిల్లా లక్ష్మీపురంలో మే14న రాత్రి భవన నిర్మాణంలో పనిచేస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఏడుగురు కూలీలు మృతి చెందారు. బాధిత కుటుంబాలకు వైయస్‌ జగన్‌ పరామర్శ. పది రోజుల్లోగా పరిహారం ఇవ్వకపోతే ఉద్యమిస్తామని సర్కార్‌పై హెచ్చరికలు జారీ. 

మే30:  అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైయస్‌ఆర్‌సీపీ నేతలపై టీడీపీ దౌర్జన్యం. కార్యకర్తలకు పరామర్శించేందుకు వచ్చిన రాప్తాడు వైయస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై దాడికి యత్నం.
===============
జూన్‌
============
జూన్‌1: అనంతపురం జిల్లాలో టీడీపీ దాడులపై నిరసన వెల్లువ. వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తల ర్యాలీ, ధర్నా. టీడీపీ నేతల దౌర్జన్యం, పోలీసుల పక్షపాత వైఖరిపై మండిపాటు.

  జూన్‌ 8: చంద్రబాబు రెండేళ్ల పాలనపై వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స ధ్వజం. అవినీతి, అధికార దుర్వినియోగం, అరాచకాలతో పాలన సాగిందని ఫైర్‌. 
============
జూలై నెల
============
 జూలై 3: చిత్తూరు జిల్లా నగరి చైర్‌ పర్సన్‌ పై టీడీపీ నేతల దాడి.  పోలీసుల ఎదుటే టీడీపీ కార్యకర్తల గూండాగిరి
స్పృహతప్పి కిందపడిపోయిన శాంతకుమారి. రంజాన్‌ తోఫా కార్యక్రమానికి మీరెందుకుచ్చారంటూ టీడీపీ నేతల దుర్భషలు. ఫిర్యాదు చేసేందుకు పీఎస్‌ కు వెళ్లిన శాంతకుమారిపై విచక్షణారహితంగా దాడి

జూలై 8: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యుల ప్రత్యేక ప్రార్థనలు, పులివెందుల నియోజకవర్గం నుంచి గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.

జూలై 11: నరసరావుపేటలో టీడీపీ వర్గీయుల వీరంగం. వైయస్‌ఆర్‌సీపీ యువనేతకు చెందిన కేబుల్‌ కార్యాలయంపై దాడి.     
 జూలై 30: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి  విగ్రహం తొలగింపు. విజయవాడలో అర్థరాత్రి వేళ సర్కారు కక్షసాధింపు చర్య
============
ఆగష్టు నెల
============
ఆగష్టు 2: ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌. స్తంభించిన ఆంధ్రావని
వేలాదిమంది నాయకుల అరెస్ట్‌. పలు చోట్ల లాఠీఛార్జ్‌
వందలాది మందికి గాయాలు.  తిరుపతిలో పోలీసుల దాష్టీకం. మహిళల పుస్తెలు తెంచి, చీరలు చింపిన ఖాకీలు

ఆగష్టు  7: నారావారిపల్లెలో వైయస్‌ఆర్‌సీపీ పక్షాన నిలిచిన ముగ్గురు యువకులపై కేసు నమోదు

ఆగష్టు 8: హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని రాష్ట్రపతికి వైయస్‌ జగన్‌ ఐదు పేజీల లేఖ. ప్రత్యేక హోదా ఐదుకోట్ల ఆంధ్రుల భవిష్యత్తు .విభజన హామీలు అమలయ్యేలా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి. 
 
ఆగష్టు 9: ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేయాలని, ఇందుకు వామపక్షాల మద్దతు కోరిన వైయస్‌ జగన్‌.  హోదా సహా పలు అంశాలపై చర్చ.
ఆగష్టు 10: హోదా కోసం రిషికేష్‌ లో వైయస్‌ జగన్‌ ప్రత్యేక పూజలు. గంగాస్నానం, యాగం చేసిన ప్రతిపక్ష నేత
  
ఆగష్టు  12: తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం సూదాపాలెంలో దళితులపై దాడి. మైనర్‌ బాలుడిని చెట్టుకు కట్టేసి చెప్పులు, కరల్రతో కొట్టిన కిరాతకులు. బాధిత కుటుంబాలను అమలాపురం ఏరియా ఆస్పత్రిలో వైయస్‌ జగన్‌ పరామర్శ.
 
 ఆగష్టు  13: పుష్కరాలు ప్రారంభమయ్యాక ప్రతిపక్ష నేతకు ఆహ్వానం. వైయస్‌ జగన్‌ ఇంటి గేటు వద్దకు వచ్చి కుళ్లు రాజకీయాలు చేసిన మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎమ్మెల్యే శ్రవణ్‌ కుమార్‌. 
 
ఆగష్టు  16: పుష్కర స్నానానికి వెళ్లి విద్యార్థుల మృత్యువాత. బాధిత కుటుంబాలకు ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌. కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాల వల్లే ఇలాంటి ఘటనలు అని మండిపాటు. పిల్లల చావుకు ఇసుకమాఫియానే కారణమని విమర్శలు. బాబు బాధ్యత వహించాలని వైయస్‌ జగన్‌ డిమాండ్‌.  
 
ఆగష్టు 20: ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం. క్షతగాత్రులను పరామర్శించిన వైయస్‌ జగన్‌. రెండు రాష్ట్రాలు పరిహారం చెల్లించాలని డిమాండ్‌.    
============
సెప్టెంబర్‌ నెల
============
 సెప్టెంబర్‌ 2: రాష్ట్రవ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమం. ఇడుపులపాయలో మహానేతకు నివాళులర్పించిన వైయస్‌ జగన్, కుటుంబ సభ్యులు, రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్‌∙విగ్రహాలకు పాలాభిషేకం, ప్రత్యేక ప్రార్థనలు, పలు సేవా కార్యక్రమాలు

సెప్టెంబర్‌ 3: వైయస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద వైయస్‌ జగన్‌ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్న పట్టించుకునే నాథుడు లేడని ఆగ్రహం.  సెప్టెంబర్‌ 6: ప్రతిపక్షంపై తుని రైలును ప్రయోగించిన చంద్రబాబు. ఓటుకు కోట్లు కేసులో ప్రతిపక్ష ఎమ్మెల్యే దర్యాప్తు కోరినందుకు ప్రతీకారం. తుని కేసులో భూమనను 6 గంటల పాటు విచారించిన సీఐడీ

సెప్టెంబర్‌ 7: ఏపీకి ప్రత్యేకహోదా కుదరదని తేల్చేసిన కేంద్రం. అర్ధరాత్రి ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ. అర్ధరాత్రే స్వాగతించిన చంద్రబాబు.  బాబు స్వార్థ రాజకీయం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం
 
సెప్టెంబర్‌ 8: అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్‌. చర్చకు అంగీకరించని ప్రభుత్వం.


సెప్టెంబర్‌ 10: ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌.   
బాబు కేసుల భయంతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వైయస్‌ జగన్‌ నిప్పులు.

 సెప్టెంబర్‌ 22: ఏలూరులో వైయస్‌ జగన్‌ ఆధ్వర్యంలో యువభేరి. బీజేపీ, టీడీపీలు కలిసి ప్రజలను దారుణంగా వంచించాయని ప్రతిపక్ష నేత ఆగ్రహం. జైట్లీ ప్రకటనను స్వాగతించడానికి చంద్రబాబు ఎవరని నిలదీత. 

సెప్టెంబర్‌ 26: గుంటూరు జిల్లాలో వరద బాధితులకు వైయస్‌ జగన్‌ పరామర్శ. రైతులను ఆదుకోవాలని డిమాండ్‌
సీఎం ఆకాశంలో చక్కర్లు కొడితే రైతుల కష్టాలు తెలుస్తాయా? అని నిలదీత  
============
అక్టోబర్‌ నెల
============
అక్టోబర్‌ 5: అనంతపురంలో వైయస్‌ జగన్‌ రైతు ధర్నా. బాబు అబద్ధాలు, నాటకాలతో  మోసం చేస్తున్నారని వైయస్‌ జగన్‌ ఆగ్రహం. సాయంత్రం వైయస్‌ఆర్‌ జిల్లా  ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాల్లో పాల్గొన్న వైయస్‌ జగన్‌. ఏసీసీ బాధిత రైతులకు అండగా ఉంటానని భరోసా

అక్టోబర్‌ 6:  వైయస్‌ఆర్‌ జిల్లా పెండ్డిమ్రరిలో వైయస్‌ జగన్‌ పర్యటన. రైతులందరికీ సబ్సిడీ విత్తనాలివ్వాలి ప్రతిపక్ష నేత డిమాండ్‌.
 
 అక్టోబర్‌ 13: ఆ పదివేల కోట్లు ఎవరివో వెల్లడించాలని ప్రధాని మోడీకి వైయస్‌ జగన్‌ బహిరంగ లేఖ. ఆదాయ వెల్లడి వివరాలు ఏపీ సీఎంకు ఎలా తెలిశాయంటూ నిలదీత.  
 
అక్టోబర్‌ 18: చెన్నై, అమరావతిలోని సదావర్తి భూములు పరిశీలించిన వైయస్‌ఆర్‌సీపీ బృందం. వేయి కోట్ల దోపిడీకి తెరలేపిన ప్రభుత్వం 

అక్టోబర్‌ 19: తుందుర్రు ఆక్వాఫుడ్‌ పార్క్‌ బాధితులకు వైయస్‌ జగన్‌ సంఘీభావం.  కాలుష్య ఫ్యాక్టరీ వద్దంటే హత్యాయత్నం కేసులు పెట్టి జైల్లో పెడతారా..?డ్రామాలు కట్టిబెట్టి పద్ధతి మార్చుకో...ప్రజల కోసం పనిచేయడం నేర్చుకో అని సీఎంకు హితవు. 
  
అక్టోబర్‌ 26: ప్రత్యేక హోదా సాధనకు కర్నూలులో వైయస్‌ జగన్‌ ఆధ్వర్యంలో యువభేరి. విద్యార్థులను చైతన్యపరిచిన ప్రతిపక్ష నేత. హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు  రాజీనామాలకు సిద్ధమని సంచలన ప్రకటన. 
============
నవంబర్‌ నెల
============

నవంబర్‌ 2: చంద్రగిరి నియోజకవర్గంలో వివాహ వేడుకలకు హాజరైన వైయస్‌ జగన్‌. ఘన స్వాగతం పలికిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు
 
నవంబర్‌ 4: తూర్పు గోదావరి జిల్లా మాజీ కార్పోరేటర్లు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక. వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కూతురు పోలు విజయలక్ష్మీ

నవంబర్‌ 6: విశాఖలో వైయస్‌ జగన్‌ ఆధ్వర్యంలో జై ఆంధ్రప్రదేశ్‌ భారీ బహిరంగ సభ. ప్రత్యేక హోదా నినాదంతో పోటెత్తిన విశాఖ తీరం

నవంబర్‌ 9: వైయస్‌ జగన్‌తో ఆక్వా ఫుడ్‌ పార్క్‌ బాధితుల భేటీ. ఉద్యమానికి అండగా ఉంటానని వైయస్‌ జగన్‌ హామీ.

నవంబర్‌ 12: ఎంపీలతో వైయస్‌ జగన్‌ భేటీ..పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం.

నవంబర్‌ 13: వైయస్‌ జగన్‌ను కలిసిన సంధ్యారాణి కుటుంబ సభ్యులు. మెడికో విద్యార్థి సంధ్యారాణి మృతికి కారకులను శిక్షించేలా పోరాడుతామని హామీ.

నవంబర్‌ 22: తూర్పు గోదావరి జిల్లాలోని దివీస్‌ వ్యతిరేక పోరాటానికి వైయస్‌ జగన్‌ మద్దతు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక దివీస్‌ ఇక్కడ లేకుండా చేస్తామని భరోసా.

నవంబర్‌ 23: నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై రాజమండ్రిలో వైయస్‌ జగన్‌ మీడియా సమావేశం.
కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు సమర్ధించడం దారుణమని మండిపడ్డ వైయస్‌ జగన్‌. 

నవంబర్‌ 24: నోట్ల రద్దు అమలు తేదీని వాయిదా వేయాలని ప్రధానికి వైయస్‌ జగన్‌ బహిరంగ లేఖ. అమలులో లోపాలని సరిదిద్దాలని విజ్ఞప్తి.

నవంబర్‌ 28: నోట్ల రద్దుకు నిరసనగా వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా హర్తాళ్‌. పార్టీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు. గృహనిర్భందం.

నవంబర్‌ 29: పులివెందుల నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌ పర్యటన. మాజీ సర్పంచ్‌ ఓబులురెడ్డి మృతితో కుటుంబ సభ్యులకు జననేత పరామర్శ.
===========
డిసెంబర్‌ నెల
============
డిసెంబర్‌ 1: బందర్‌ పోర్టు బాధితులకు వైయస్‌ జగన్‌ భరోసా. రెండేళ్లు రక్షించుకుందాం. మీ భూములు బాబు లాక్కున్నా మేం వచ్చాక తిరిగి ఇచ్చేస్తామని నిర్వాసితులకు హామీ. 

డిసెంబర్‌ 3: ఆరోగ్యశ్రీ అమలు తీరుపై సీఎంకు వైయస్‌ జగన్‌ బహిరంగ లేఖ. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చొద్దు అంటూ హితవు.  

డిసెంబర్‌ 7, 8: తూర్పు గోదావరి జిల్లాలో వైయస్‌ జగన్‌ పర్యటన. పోలవరం ముంపు గ్రామాల ప్రజల సమస్యలు తెలుసుకున్న ప్రతిపక్ష నేత. బాధితులకు పరిహారం చెల్లించాలని, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ వర్తింపచేయాలని డిమాండ్‌.  

డిసెంబర్‌ 9: ఆరోగ్యశ్రీ అమలు తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు. ఒంగోలు నగరంలో తలపెట్టిన ఆందోళనలో పాల్గొన్న వైయస్‌ జగన్‌. ఆరోగ్యశ్రీకి మీరిచ్చే డబ్బు బకాయిలకే సరిపోవడం లేదు.
బిల్లులు పెంచకపోతే వైద్యం ఎలా చేస్తారని నిలదీత. 
 
డిసెంబర్‌ 12: తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

డిసెంబర్‌ 13: బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ వైయస్‌ఆర్‌సీపీలో చేరిక. వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన శ్రీనివాస్‌.
 
డిసెంబర్‌ 16: మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డి మనవడు కాసు మహేష్‌రెడ్డి వైయస్‌ఆర్‌సీపీలో చేరిక. నరసరావుపేటలో భారీ బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన మహేష్‌ రెడ్డి.    

డిసెంబర్‌ 20:  నోట్ల రద్దు తదనంతరం పరిణామాలపై గవర్నర్‌తో వైయస్‌ జగన్‌ భేటీ. ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. మీరైనా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి.  

డిసెంబర్‌ 21: నిరాడంబరంగా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు. రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు.
  
డిసెంబర్‌ 24:  వైయస్‌ఆర్‌ జిల్లాలో వైయస్‌ జగన్‌ పర్యటన. ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు. వైయస్‌ఆర్‌ గురువు పేరుతో ఏర్పాటు చేసిన వెంకటప్ప పాఠశాల పదో వార్షికోత్సవంలో పాల్గొన్న వైయస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, అధ్యక్షులు వైయస్‌ జగన్, ఆయన సతీమణి భారతమ్మ.

డిసెంబర్‌ 25: పులివెందుల సీఎస్‌ఐ చర్చీలో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న వైయస్‌ జగన్‌. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు. 

డిసెంబర్‌ 26: వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట వైయస్‌ జగన్‌ ఆధ్వర్యంలో రైతు ధర్నా. పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌కు నీటిని విడుదల చేయాలని డిమాండ్‌.