ప్రజల కోసం మేము కదిలితే.. మా కోసం ప్రజలు నడవడం దేవుడిచ్చిన వరం

13 Jun, 2018 10:52 IST

 
  
12–06–2018, మంగళవారం
రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి


వేదంలా ఘోషించే గోదారమ్మ చెంత మనసంతా ఉద్విగ్నభరితమైంది. ప్రజలందరికీ కడుపునింపే కన్నతల్లి చెంత నిలిచినట్లని పించింది. గోష్పాద క్షేత్రంలో.. గౌతమీ స్నాన ఘట్టంలో గోదారమ్మతల్లికి జలహారతి ఇస్తున్నప్పుడు కోట్లాది మందికి ప్రాణాధారమైన ఆ తల్లిలా.. ప్రజలకు ఉపయోగపడి జన్మసాఫల్యమైతే చాలనిపించింది. సకల ప్రజల సంక్షేమార్థం బాలాత్రిపురసుందరీసమేత సుందరేశ్వరస్వామిని పూజించాను.

పశ్చిమగోదావరి పూర్తయి తూర్పులోకి అడుగుపెడుతున్న వేళ.. చేరువలోనే గోదావరి ఉన్నా తాగునీరు అందని కష్టం నుంచి, సవాలక్ష సమస్యలను నాతో చెప్పుకొన్న లక్షలాది మంది పశ్చిమవాసుల దయనీయ పరిస్థితులు మదిలో మెదులుతూనే ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లో గెలిపించిన పాపానికి.. జిల్లా మొత్తాన్ని పీల్చి పిప్పిచేసి, దోచేసి.. తనదైన శైలిలో రుణం తీర్చుకున్నాడు చంద్రబాబు. దానికి ప్రతిఫలం ఇచ్చి తీరాలన్న పట్టుదల, కసి, కోపం ప్రజలందరిలో అడుగడుగునా కనిపించాయి. 


గోదావరి నదిపై.. రైలురోడ్డు వంతెనపై దాదాపు నాలుగున్నర కిలోమీటర్ల మేర ఇసుకేస్తే రాలనంతగా.. అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో పార్టీ పతాకాలు చేతబట్టిన అభిమాన జనసంద్రం మధ్య సాయంత్రం పాదయాత్ర సాగింది. కింద పరవళ్లు తొక్కుతున్న ప్రవాహం.. పైన ఉరకలెత్తుతున్న ఉత్సాహం.. జన ప్రకంపనల మధ్య తూర్పుగోదావరిలోకి ప్రవేశించాను. జన్మలో మరిచిపోలేని అనుభవమిది. ఇదే వంతెనపై నాన్నగారు, సోదరి షర్మిల, నేనూ పాదయాత్ర చేయడం.. మువ్వురినీ వరుణదేవుడు ఆశీర్వదించడం మధురమైన అనుభూతి. ప్రజల కోసం మేము కదిలితే.. మా కోసం ప్రజలు నడవడమన్నది దేవుడిచ్చిన వరం. ఆకాశ వర్షంలో.. అభిమానజన హర్షంలో.. శతాబ్దాల చరితగల రాజమహేంద్రవరంలో అడుగుపెట్టాను. ఓ వైపు.. సంస్కృతి – సంప్రదాయాలు, కళలు – కవులు, విప్లవాలు – సంస్కరణల ఘన చరిత్ర గుర్తుకొస్తే, మరోవైపు.. కేవలం ప్రచారార్భాటం కోసం పవిత్ర పుష్కరాలలో 29 మంది అమాయక ప్రజల ప్రాణాలు బలిగొన్న చంద్రబాబు పాపపంకిలమూ గుర్తొచ్చింది. 

ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేయాలని తపనపడ్డ నాన్నగారు పోలవరం ప్రాజెక్టును తలపెట్టారు. చిత్తశుద్ధితో అనితర సాధ్యమైన రీతిలో పనులు జరిగేలా చేశారు. మరి నేడు.. రాష్ట్రానికి వరం లాంటి పోలవరం కాస్తా.. బాబుగారికి మాత్రమే వరంలా మారింది. జాతీయ హోదా కలిగిన ఆ భారీ ప్రాజెక్టు కాస్తా.. భారీ కుంభకోణంలా తయారైంది. జాతికి జీవనాడి అయిన అంత గొప్ప ప్రాజెక్టు విషయంలో సైతం అబద్ధాలు, మోసపూరిత ప్రకటనలు, మభ్యపెట్టే మాటలు.. నిజంగా శోచనీయం. పూర్తిగాని ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నానని ప్రకటించడం బాబుగారి ఆలోచనల క్షుద్రత్వానికి పరాకాష్ట. నయవంచనకు నిలువుటద్దం. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ‘నీటి ప్రాజెక్టుల గురించి పట్టించుకో.. చరిత్రహీనుడివి కావొద్దు’ అంటూ ప్రతిపక్ష నాయకుడి హోదాలో నాన్నగారు అసెంబ్లీ సాక్షిగా పదేపదే మిమ్మల్ని హెచ్చరించినా.. మిన్నకుండిపోవడం వాస్తవం కాదా? పోలవరాన్ని పట్టించుకోని మీ నిర్లక్ష్యానికి నిరసనగా మీ పార్టీ ఎమ్మెల్యేనే మీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి.. రాజీనామా లేఖ ఇచ్చిన చరిత్ర మర్చిపోయారా? పోలవరాన్ని మీ చేతుల్లోకి తీసుకుని దోచుకోవడం కోసం.. ప్రత్యేక హోదాను సైతం తాకట్టు పెట్టింది ప్రజలు మరిచిపోయారనుకుంటున్నారా? కేవలం కమీషన్ల కోసమే సబ్‌కాంట్రాక్టర్లకు నామినేషన్‌ పద్ధతిలో.. పెంచిన రేట్లకే పనులు కేటాయించడం మీ విచ్చలవిడి అవినీతికి నిదర్శనం కాదా? ఇంకా ఎంతకాలం మీ నయవంచన? 
-వైయ‌స్‌ జగన్‌