జగన్‌పై యెల్లో గ్యాంగ్ కుట్రలు
రోజు రోజుకూ బలహీనపడిపోతున్న చంద్రబాబు నాయుడు, యెల్లో గ్యాంగ్‌లు అంతకంతకూ ప్రజాభిమానం పెంచుకుంటున్న శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిపై కుట్రలు, కుతంత్రాలకు మరింత పదును పెడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. ‘ఈనాడు రాసింది.. చంద్రబాబు వాగాడని, మళ్లీ చంద్రబాబు వాగిందే ఈనాడు రాయడం’ పరిపాటిగా మారిందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గట్టు మాట్లాడారు.
సార్వత్రిక ఎన్నికల పరుగులో చతికిలపడి శల్య రాజకీయాలు చేస్తున్నారని గట్టు మండిపడ్డారు. వీరి కుట్రలో భాగంగా కోతికి కొబ్బరికాయ దొరికిందన్నట్లు ఆమెరికాలోని ఎఫ్‌బీఐ సంస్థ అభియోగాలంటూ పేజీలకు పేజీలు రాసుకుంటూ శ్రీ జగన్‌పై యెల్లో గ్యాంగ్ విషం కక్కుతోందని ధ్వజమెత్తారు. ‘ఈనాడు రామోజీరావుకు అమెరికా అభియోగాలయ్యేసరికి అంత అందంగా కనిపిస్తున్నాయా? రామోజీపై దేశంలో, రాష్ట్రంలో ఎన్ని అభియోగాలు లేవా’ అన్నారు.
అమెరికాలో ఉన్న కంపెనీతో టైటానియం డీల్ ఒకటి జరిగిందని, దాంట్లో కుంభకోణముందని ఆ అభియోగంలో ఆరుగురు పేర్లను ప్రస్తావించారట! అందులో ఒకటి కేవీపీ పేరుంటే దానికి జవాబు చెప్పుకోవాల్సింది ఆయనే. దాన్ని తీసుకొచ్చి ‘సిన్నోడి మేతే’ అంటూ రామోజీ తన పత్రికలో రాస్తారు. దానికి చంద్రబాబు సిన్నోడంటే శ్రీ జగన్ అని చెబుతారు. అందులో ఎక్కడా శ్రీ జగన్మోహన్‌రెడ్డి పేరు లేకపోయినా ఇరువురూ శివాలెత్తారన్నారు. ఎఫ్‌బీఐ ప్రస్తావించిన ఆరుగురి పేర్లలో వైయస్ఆర్ పేరు గాని, శ్రీ జగన్ పేరు గానీ ఎక్కడైనా ఉన్నాయా? ఎలాంటి సంబంధం లేని వాటిని తీసుకొచ్చి శ్రీ జగన్‌కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఫిర్టాస్ అనే వ్యక్తి అసలు ఎవరికీ ముడుపులు ఇవ్వలేదంటున్నారు. కానీ దీన్ని తీసుకొచ్చి శ్రీ జగన్‌కు అంటగట్టడం సిగ్గుచేటు అని గట్టు అన్నారు.
ఎఫ్‌బీఐ మోపిన అభియోగంలో సీఎంకు బంధువని ప్రస్తావించారు. రక్తం పంచుకు పుట్టిన శ్రీ జగన్ ఏమైనా వైయస్‌కు బంధువా? కుటుంబ సభ్యులను ఎక్కడైనా బంధువుగా ప్రస్తావిస్తారా? అంటే వారి ఆలోచన ప్రకారం చంద్రబాబుకు ఆయన కుమారుడు లోకేష్ బంధువా? రామోజీకి వారి కొడుకులు సుమన్, కిరణ్‌లు బంధువులా? అన్నారు. వీరి తీరు చూస్తుంటే చంద్రబాబు ఇంట్లో పిల్లి పాలు తాగకపోయినా దానికి శ్రీ జగన్ కుట్రే ఉందని యెల్లో గ్యాంగ్ ప్రచారం చేసేలా ఉంది! జనాభిమానాన్ని పొందలేక శ్రీ జగన్ ఫోబియా పట్టుకొని నిత్యం బురదచల్లే ప్రయత్నంలో చంద్రబాబు, రామోజీ మునిగిపోయారన్నారు. ఓట్లు, సీట్ల కోసం ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారా? వైయస్ మరణించిన తర్వాత నాలుగేళ్లుగా ఎన్నో తప్పుడు ప్రచారాలు, అక్రమ కేసులతో అభాండాలు మోపుతూనే ఉన్నారని ఆరోపించారు.
రామోజీ.. అబ్దుల్లాపూర్‌మెట్ దగ్గర నుంచి రామోజీ ఫిలిం సిటీ దాకా ఉన్న నాలుగు కిలోమీటర్ల దారి నీకెక్కడిదో, ఎవరి దగ్గర కొన్నావో నీ పత్రికలో రాసుకోగలవా? ఫిలింసిటీలో ఉన్న 20 ఎకరాల అసైన్డు భూమిని వదిలిపెట్టావా? పాల్మాకులలో అక్రమంగా ఆక్రమించుకున్న 320 ఎకరాల విషయాన్ని రాస్తావా? రామోజీని ఎన్నిసార్లు అరెస్టు చేయలేదు? విశాఖలోని ఈనాడు స్థలం వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో మొట్టికాయలు వేసిన విషయాన్ని ఎందుకు రాయలేదని ప్రశ్నించారు.
రామోజీకి సీబీఐ కన్నా ఎఫ్‌బీఐ పవర్‌ఫుల్‌గా కనిపించిందట! నిన్నటి దాకా సీబీఐని మించిన పవర్‌ఫుల్ సంస్థ మరొకటి లేదన్నారు. అంతకు ముందు అదే సీబీఐని... కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ప్రచారం చేసిందీ రామోజీయే. ఆ సంస్థ శ్రీ జగన్‌పై కేసు చేపట్టే సరికి పునీతమైందట! అసెంబ్లీలో గీతం యూనివర్సిటీ కుంభకోణంలో బిగ్‌బాస్ పేరుతో ఉన్న లెటర్‌ను మైసూరారెడ్డి బయటపెడితే, ఈ బిగ్‌బాస్ చంద్రబాబే అని రామోజీ ఆయన పత్రికలో ఎందుకు రాయలేద?ని గట్టు రామచంద్రరావు నిలదీశారు.