చేతకాని దద్దమ్మలతో పనిచేయిస్తున్నావు

27 Feb, 2017 18:18 IST
– దళిత, గిరిజన, మైనారిటీ, బీసీ వర్గాలకు అన్యాయం 
– వైయస్సార్‌ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగార్జున ఆగ్రహం

పట్నంబజారుః  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతకాని దద్దమ్మలతో పనిచేయిస్తూ.. దళిత, గిరిజన, మైనారిటీ, బీసీ వర్గాల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున  ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్‌ మోసాలపై ప్రజలు కన్నెర్రజేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత దళిత వర్గాలతొ పాటు ఉన్నత వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. బాబు వస్తే జాబు ఖాయమని చెప్పి..ఒక్క ఉద్యోగాన్ని అయినా..ఇవ్వగలిగారా అని సూటిగా ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్‌ స్రీనింగ్‌ టెస్ట్‌లకు 6 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా హాజరైయ్యారని, అయితే పరీక్షలు మాత్రం తప్పుతడకలుగా జరిగాయని ఆరోపించారు. అసలు రాజ్యంగమంటే ఎందుకు అంత చిన్నచూపుతో వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. చట్టాలను చుట్టాలుగా వాడుకుంటూ..నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్‌లకు సంబందించి ఎటువంటి ప్రాతిపదిక తెలపకుండా..పరీక్షలు నిర్వహించటం సబబుకాదన్నారు. రిజర్వేషన్‌లు ప్రకటించకుండా ఉన్న ఉద్యోగాలన్ని తన ఇంట్లో వారికి ఇచ్చుకోవాలని చంద్రబాబు చూస్తున్నట్లు ఉందని విమర్శించారు. ఏపీపీఎస్సీ అధికారి ఉదయ్‌భాస్కర్‌ చంద్రబాబు చేతిలో ఆయుధంలా వ్యవహరించటం సబబుకాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏ ఒక్కటి సరిగా లేకపోవగా..ప్రజలను మరింత ఇబ్బందులు పెట్టే పరిస్ధితి ఉందని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హాయాంలో ఉద్యోగమేళాలు పెట్టి మరీ యువతకు అవకాశాలు కల్పించారన్నారు. రిజర్వేషన్‌లను ఇప్పటికైనా ప్రకటించాలని లేనిపక్షంలో పోరాటానికి సిధ్ధపడాల్సి వస్తుందని స్పష్టం చేశారు. 

బాబు మాటలు నీటిపై రాతలు....
ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు చెప్పిన మాటలన్ని నీటిపై రాతలుగా మిగిలిపోయారని వైయస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. మేనిఫెస్టో పెట్టిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశామనే చెప్పే ధైర్యం టిడిపి నేతలకు ఉందా అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు బాసటా వైయస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరుబాట పట్టనున్నారని తెలిసి..అప్పటికప్పుడు కేబినెట్‌ సమావేశాలు పెట్టుకుని చర్చించుకున్నారని తెలుస్తోందన్నారు. నిరుద్యోగ యువత పక్షాన పోరాడుతుంటే ఎందుకు భయపడున్నారని ప్రశ్నించారు. మూడు సంవత్సరాల పాలనలో ఏ ఒక్క పని చేయలేదు కాబట్టే భయం పట్టుకుందన్న విషయం ప్రజలకు తెలుసున్నారు. రాష్ట్ర విభజన తరువాత వేలాది పరిశ్రమలు...లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ఆశించిన ప్రతి ఒక్కరికి మొండిచేయి చూపించిన ఘనత చంద్రబాబు సర్కార్‌కే దక్కుతుందని దుయ్యబట్టారు. అర్హతలు ఉన్న వారికి కాకుండా ఇష్టానూసారంగా ఎవరికిబడితే వారికి ఉద్యోగాలు ఇస్తామంటే చూస్తు ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నేతలు పోలూరి వెంకటరెడ్డి, ఏలికా శ్రీకాంత్‌యాదవ్, జగన్‌కోటి, షేక్‌ రబ్బాని, చందోలు డేవిఢ్‌విజయ్‌కుమార్, రమేష్, కౌతరపు పిచ్చయ్యశాస్తి్ర, నిమ్మురాజు శారదాలక్ష్మీ, గాలి అరవింద, కుందేటి రమేష్‌ తదితరులు పాల్గోన్నారు.