గెలుపే లక్ష్యంగా సాగాలి: విజయమ్మ

14 Jun, 2013 10:09 IST
తిరుపతి 14 జూన్ 2013:

సమష్టిగా పనిచేసి స్థానిక ఎన్నికలలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేలా కృషి చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్  పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగించారు. స్థానిక ఎన్నికలలో సత్తా చూపి పార్టీ ప్రతిష్ఠను ఇనుమడింపజేయాలని సూచించారు. స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని నాయకులను ఆదేశించారు.

పంచాయతీ ఎన్నికలలో గెలుస్తుందన్న నమ్మకం తనకుందనీ.. కానీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందుకోసం మరింత కృషి చేయాలనీ కోరారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకుని ప్రాధాన్యతా క్రమంలో వాటిని తీర్చే చర్యలు చేపట్టాలన్నారు.
స్థానిక ఎన్నికలు మన బలాన్ని చాటుకోవడానికి చక్కటి వేదికని శ్రీమతి విజయమ్మ అభిప్రాయపడ్డారు. సమష్టిగా పనిచేసి 80శాతం గ్రామ పంచాయతీలను చేజిక్కించుకోవాలని కోరారు. కార్యకర్తలు పార్టీకి స్థంభాల వంటి వారన్నారు. పార్టీ విజయానికి వారే అహరహం పనిచేయాలంటూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. పార్టీకి భావి నాయకులుగా రూపాంతరం చెందాలని ఆమె కార్యకర్తలకు ఉద్బోధించారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన అనంతరం అన్ని ఉప ఎన్నికలు, ఇతర ఎన్నికలలో విజయం సాధిస్తూ వస్తున్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు.  ఈ విజయాలే స్ఫూర్తిగా పార్టీ కార్యకర్తలు ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. జనాభాకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

సీబీఐ కక్షసాధింపు ధోరణి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల సీబీఐ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని శ్రీమతి విజయమ్మ మండిపడ్డారు. ముఖ్యమంత్రిని గానీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును గానీ సీబీఐ ఎందుకు విచారించడం లేదని ఆమె నిలదీశారు. చిత్తూరు జిల్లాలో రూ. 1500 కోట్ల పెట్టుబడి కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 135 శాతం రాయితీలిచ్చారనీ, వాస్తవానికి ఇవి యాబై శాతం మించకూడదనీ చెప్పారు. ఈ అంశంలో కిరణ్ కుమార్‌ను సీబీఐ ఎందుకు విచారించదని ప్రశ్నించారు. ములాఖత్ అంశంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి జైలు నిబంధనావళిని ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. కాంగ్రెస్, టీడీపీల రాజకీయ కుట్రకు ఆయన బలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి త్వరలో బయటకొస్తారనీ, దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ సువర్ణ పాలనను అందిస్తారనీ శ్రీమతి విజయమ్మ భరోసా ఇచ్చారు.