సీమను నరికేసే అధికారం ఎవరిచ్చారు?

3 Dec, 2013 10:45 IST
పలమనేరు (చిత్తూరు జిల్లా):

రతనాలసీమను అడ్డంగా ముక్కలు చేసి రెండు జిల్లాలను తెలంగాణలో కలపే కన్నా.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను తెలంగాణకు కలిపేసి ఆ సమైక్య రాష్ట్రానికి తెలంగాణ పేరు పెట్టండని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తన కుమారుడిని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తుంటే అందుకు టీడీపీ అ‌ధ్యక్షుడు చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వంత పాడుతున్నారని మండిపడ్డారు.

తెలుగుజాతి ఆత్మగౌరవానికి, ఢిల్లీ అహంకారానికి మధ్య పోరాటం జరుగుతోందని శ్రీ జగన్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 30 పైచిలుకు పార్లమెంటు స్థానాలు తెచ్చుకుని ఢిల్లీ కోటను మనమే నిర్మిద్దాం.. అని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడదాం అని నినదించారు. ‌ ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర సోమవారం మూడవ రోజు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో సాగింది. బెరైడ్డిపల్లెలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి శ్రీ జగన్ ప్రసంగించారు.

‌ప్రసంగం ముఖ్యాంశాలు ఆయన మాటల్లో..

మనలను ఎంత చులకనగా చూస్తున్నారు :

'పేపర్‌లో చదివాను. రాయల తెలంగాణ అని ఇంకొకటి తీసుకొస్తున్నారట. రాయల సీమను కూడా అడ్డంగా నరికేస్తారట. రాయలసీమను అడ్డంగా నరికేసి రెండు జిల్లాలను అటువైపు కలపటం కన్నా.. మిగిలిన అన్ని జిల్లాలను అటువైపే కలిపేసి రాష్ట్రం పేరు తెలంగాణ రాష్ట్రం అని పెట్టేస్తే ఎవరు వద్దంటున్నారు? రాష్ట్రం పేరు మార్చేయండి.. తెలంగాణ రాష్ట్రం అని పేరు పెట్టండి.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి.. వాళ్ల ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. వీళ్లు మనలను ఎంత చులకనగా చూస్తున్నారో ఇంత కన్నా వేరే నిదర్శనం ఏం కావాలి? పైనుంచి దేవుడు చూస్తున్నాడు. కచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్లకు బుద్ధి వచ్చేటట్టు దేవుడు మొట్టికాయ వేస్తాడు' అన్నారు.

'రాయలసీమ రతనాల సీమ. ఆ రాయలసీమలో అట్టడుగున ఉన్న జిల్లా చిత్తూరు. చిత్తూరు  జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సమైక్య శంఖారావం పూరించడానికి కారణం ఏమిటంటే .. చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా రాష్ట్ర ప్రజలు సమైక్యమే కోరుకుంటున్నారన్న సందేశం ఢిల్లీకి చేరాలి. ప్రజలంతా సమైక్యంగా ఉండాలని, తెలుగుజాతి ఒక్కటిగా ఉండాలని కోరుకుంటుంటే సోనియాగాంధీ మాత్రం ఓట్ల కోసం, సీట్ల కోసం, తన కొడుకును ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టుకోవడం కోసం రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారు. అందుకు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి తందానా అంటున్నారు' అని శ్రీ జగన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

'రాష్ట్రం విడిపోతే ఉత్పన్నమయ్యే సమస్యలు వీళ్లకు తెలుసా? తెలిసినా కళ్లున్న కబోదుల్లా ఉన్నారా? ఈ రోజు రాష్ట్రం ఐక్యంగా ఉన్నప్పుడే కృష్ణా నీళ్లు మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలు నిండిన తర్వాత‌ గానీ మన రాష్ట్రానికి చుక్కనీరు రాని పరిస్థితి ఉంది. ట్రిబ్యునళ్లు, బోర్డులు ఉన్నప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మధ్యలో మరో రాష్ట్రాన్ని తీసుకొచ్చి పెడితే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీరు తప్ప మంచినీరు ఎక్కడుంటుంది? రాష్ట్రం విడిపోతుందనే సంకేతాలు వచ్చాకే బ్రిజేశ్ కుమా‌ర్ టిబ్యున‌ల్ కృష్ణా జలాల మీద తీర్పు చెప్పింది‌'.

'రాష్ట్రం విడిపోతుంది కదా.. ఎవరూ అడిగేవారు లేరని మిగులు జలాలపై మనకున్న హక్కులను ఇతర రాష్ట్రాలకు పంచేసింది. పై రాష్ట్రాలకు ఎక్కువగా నీళ్ల కేటాయింపులు చేసింది. రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే ఈ అన్యాయాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? మాకు నీరు ఎక్కడి నుంచి వస్తుందని రైతన్నలు రేపు మీ కాలర్ పట్టుకొని నిలదీస్తే ఏం సమాధానం చెప్తారని సోనియా, కిర‌ణ్‌కుమార్‌రెడ్డిని, ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబును అడుగుతున్నా. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌కు నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తారని అడుగుతున్నా.'

రాష్ట్రాన్ని అధోగతి పట్టించే అధికారం ఎవరిచ్చారు? :
'ఈ పాలకులు హైదరాబాద్‌ నగరాన్ని ఒకవైపు, సముద్ర తీరాన్ని మరోవైపు విభజిస్తారట. ఎయిర్‌పోర్టులు, సీ పోర్టులను విడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇలా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసే అధికారం మీకు ఎవరిచ్చారు? పదేళ్లలో హైదరాబాద్‌ను విడిచి వెళ్లిపోవాలట మనం. విభజిస్తే తామంతా ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లాలని చదువుకున్న ప్రతి పేద పిల్లవాడు మీ కాలర్‌ పట్టుకొని అడిగితే సోనియాగాంధీ, చంద్రబాబు, కిరణ్ ఏం సమాధానం చెబుతారు? రాష్ర్ట్ర ఆదాయంలో 55 నుంచి 60 శాతం ఒక్క హైదరాబా‌ద్ నుంచే వస్తోంది. హైదరాబా‌ద్‌ను విడదీస్తే ఆ తర్వాత ఉద్యోగుల జీతాలకు డబ్బులెక్కడి నుంచి తెచ్చి ఇస్తారు?' అని శ్రీ జగన్ నిలదీశారు.

‌'దివంగత మహానేత వైయస్ఆర్ బతికున్న రోజుల్లో హైదరాబా‌ద్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఏడాదికి 57 వేల మంది విద్యార్థులకు క్యాంపస్‌లో ఉద్యోగాలు వచ్చేవి. కానీ ఆ మహానేత మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఏం జరుగుతోంది? హైదరాబాద్‌ను నాశనం చేసి పెడుతున్నారు. క్యాంపస్ రిక్రూ‌ట్‌మెంట్లు 57 వేల నుంచి 25 వేలకు తగ్గిపోయాయి. విభజన చేస్తున్న సోనియాను ఒక్క మాట అడుగుతున్నా.. మీరు 1968లో మా దేశానికి వచ్చారు. రాజీవ్‌గాంధీని పెళ్లి చేసుకుని 1983లో భారతదేశ పౌరసత్వం తీసుకున్నారు. గత 30 ఏళ్లుగా మాలో ఒకరిగా బతికారు. ఈరోజు ఎవరైనా పార్లమెంటులో బిల్లు తీసుకొని వచ్చి మీ దేశానికి తిరిగి వెళ్లిపోవాలంటే మీకు ఎలా అనిపిస్తుంది? అలా అంటే కాంగ్రెస్ వాళ్లంతా కల్లు తాగిన కోతుల్లా ఎగరరా? 30 ఏళ్లకే మీకు ఇంత వ్యామోహం ఉంటే 60 ఏళ్లుగా కలిసిబతుకుతున్న మమ్మల్ని పదేళ్లలో వెళ్లిపొమ్మంటే మాకెలా ఉంటుంది?‌ అని శ్రీ వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు.

లేఖ ఎందుకివ్వవు చంద్రబాబూ? :

'రాష్ర్టం నాశనమైపోతుంటే చంద్రబాబు కళ్లున్న కబోదిలా చూస్తున్నారు. రేపు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అడగండి. ఎందుకు సమైక్యాంధ్రకు అనుకూలంగా లేఖ ఇవ్వడం లేదని ప్రశ్నించండి. బాబుగారి నోట సమైక్యం అన్న మాట ఎందుకు రాదో గట్టిగా అడగండి. సీఎం కిరణ్ ఓవైపు సమైక్యమంటూనే మొసలి కన్నీరు కారుస్తారు. మరోవైపు సోనియా చెప్పినట్టు చేస్తారు. ఉద్యోగులను భయపెట్టి సమ్మె విరమింపజేస్తారు. ఇదేనా సమైక్యం అంటే? సమైక్యం అంటున్న కిర‌ణ్ ఎందుకు అసెంబ్లీని సమావేశపర్చడం లేదు. ఎందుకు సమైక్యరాష్ట్రం కోసం తీర్మానం చేయడం లేదు? వీళ్లంతా కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. మనమంతా ఒక్కటవుదాం. ఎన్నికల్లో 30పై చిలుకు ఎంపీ స్థానాలను మనమే తెచ్చుకుందాం. ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయితీని తీసుకొద్దాం. దుర్మార్గులను ఇంటికి పంపిద్దాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉం‌చేవారినే ప్రధాని కుర్చీలో కూర్చోబెడదాం' అంటూ శ్రీ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

సమైక్య నినాదం ఢిల్లీకి వినిపించాలి :
'నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఢిల్లీ వాళ్లకు వినిపించేలా గట్టిగా సమాధానాలు చెప్పండి. రాష్ట్రాన్ని విభజిస్తే ఒప్పుకుంటామా? (ఒప్పుకోం.. ఒప్పుకోం అని ప్రజల స్పందన) తెలుగులో చెప్తే ఢిల్లీ వాళ్లకు అర్థం కాదు.. వాళ్లకు కొంత చెవుడు ఉంది. గట్టిగా ‘నో’ అని చెప్పండి (‘నో..నో’ అని జనం స్పందన) తెలుగు జాతిని విడగొడతామంటే ఒప్పుకుంటామా (ప్రజలు: నో..నో..) అన్నదమ్ములమైన మనమే తన్నుకునే పరిస్థితి రావాలా? (జనం: నో..నో..) మన హైదరాబాద్ కోసం మనలో మనమే తన్నుకొని చావాలా (జనం: నో..నో..) ఇంకొక స్లోగ‌న్ కూడా చెప్పాలి. అది ఇంకా భీకరంగా ఉండాలి. ఢిల్లీకి వినపడాలి. జై సమైక్యాంధ్ర.. జై తెలుగుతల్లి... జై వై‌యస్ఆర్’.