పులకించిన పులివెందుల గడ్డ
మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ళ పాలన అనంతరం ఎన్నికలు అయిపోయిన వంద రోజులకే కుట్రలు, కుయుక్తులు, కుతంత్రాలతో ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డిని మన మధ్యన లేకుండా చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయాల కోసం ఎంతటి అఘాయిత్యాలకైనా పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. వ్యవస్థలు చెడిపోయాయని విచారం వ్యక్తంచేశారు. వైయస్ఆర్ మృతి చెందిన పావురాలగుట్ట వద్దకు వెళ్లినపుడు ముక్కలు ముక్కలుగా, చెల్లాచెదురుగా పడిపోయిన హెలికాప్టర్ శకలాలను చూసినప్పుడు బాధ కలిగింది. రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు, కుతంత్రాలతో ఏమైనా చేశారన్న అనుమానం తలెత్తింది. అలాంటి కుట్రలు, కుతంత్రాలను ప్రజల అండదండలతో ఎదుర్కొంటూ వచ్చానని అన్నారు. తనను ఎదుర్కోలేక జైలుకైనా పంపేందుకు వెనుకాడలేదన్నారు.
అదే కుట్ర రాజకీయాల కోసం ఓట్లు, సీట్లు ధ్యేయంగా బంగారంలాంటి రాష్ట్రాన్నీ చీల్చేశారని శ్రీ జగన్ దుయ్యబట్టారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో.. ఈ కుట్రలకు, కుతంత్రాలకు దీటైన జవాబు ఇవ్వండని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. 'మీ బిడ్డను ఆశీర్వదించండి, మనమిచ్చే తీర్పు.. సోనియా గాంధీని నీళ్లు తాగేలా చేయాలి’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థిగా గురువారంనాడు శ్రీ జగన్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా పూలఅంగళ్లు సర్కిల్‌లో వేలాదిగా తరలివచ్చిన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
వైయస్ఆర్ సమాధి వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి :
అంతకు ముందు ఉదయం శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్‌లో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి సమాధి చెంతన నామినేషన్ పత్రాలు ఉంచి ప్రార్థనలు చేశారు. తర్వాత పులివెందులలోని తన స్వగృహంలో బంధువులతో పాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం పొందారు. అక్కడి నుంచి ర్యాలీగా బయల్దేరారు. వేల మంది ప్రజలు ఈ సందర్భంగా శ్రీ జగన్‌కు ఎదురేగి ఘనంగా స్వాగతం పలికారు.
పూలఅంగళ్లు సర్కిల్‌లో శ్రీ వైయస్ జగన్ మాట్లాడుతూ ‘నాలుగున్నరేళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాలు, కన్నీళ్లు నాకు తెలుసు. శరవేగంగా సాగుతున్న అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిచిపోయిందీ తెలుసు. నా పట్ల, మా కుంటుంబం పట్ల మీరు చూపిస్తున్న ఆప్యాయత, ఆదరణ మరువలేనివి. మీ ప్రేమ, ఆప్యాయతను నా గుండెల్లో పెట్టుకొని వెళ్తున్నా.. మరో ఇరవై రోజుల్లో ఎన్నికలవగానే మీ బిడ్డ, మీ పులివెందుల ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక పులివెందులకు వస్తా. ఇక్కడ నిలిచిపోయిన పనులు వంద రోజుల్లో పూర్తిచేస్తానని హామీ ఇస్తున్నా’ అని భరోసా ఇచ్చారు. తనను, కడప ఎంపీగా పోటీచేస్తున్న తన తమ్ముడు వైయస్ అవినాశ్‌రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.