నష్టం నుంచి రైతన్నను గట్టెక్కించాలని డిమాండ్

11 Dec, 2015 17:25 IST
అనంతపురంః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి  జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తీవ్ర వర్షాభావంతో ప్రధాన పంట వేరుశనగతో పాటు పప్పుశనగ ఇతర పంటలు పూర్తిగా నాశనమయ్యాయని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.  ఎకరాకి కనీసం 30 నుంచి 40 కేజీలు కూడా పంట దిగుబడి వచ్చే అవకాశం లేదన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా శాశ్వత కరవు ప్రాంతంగా ప్రకటించాలన్నారు.

అనంతపురం జిల్లాను కరవుగా జిల్లాగా ప్రకటించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసిందేనన్నారు. రాష్ట్రంలో అత్యధిక ఆత్మహత్యలు నమోదవుతున్న ప్రాంతమైనందున జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు. పొట్ట చేతబట్టుకొని జిల్లా నుంచి 3 నుంచి 4 లక్షల మంది వరకు వలసలు వెళ్లిన విషయాన్ని పత్రికల ద్వారా మనం చూస్తున్నామన్నారు. ఇందుకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించి జిల్లా రైతులను ఆదుకోవాలన్నారు.