విశ్వసనీయతకు పట్టంగట్టాలి:షర్మిల

5 Dec, 2012 20:29 IST

జడ్చర్ల (మహబూబ్ నగర్ జిల్లా), 5 డిసెంబర్ 2012:

విలువలకు, విశ్వసనీయతకు ప్రజలు పట్టంగట్టాలని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను గాలికొదిలేసిన పార్టీలు, నేతలు కొందరు  కపట ప్రేమ ప్రదర్శిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

     'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రలో భాగంగా బుధవారం 49వ రోజు శ్రీమతి షర్మిల పాలమూరు జిల్లా జడ్చర్లలో పర్యటించారు. ఈ సందర్భంగా జడ్చర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రజలనుద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగించారు. ఎనమిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు 8 సార్లు విద్యుత్తు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. విద్యుత్తు చార్జీలు, తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించే స్థితిలోలేని రైతుల మీద కనికరం చూపకుండా జైలుకు పంపారని శ్రీమతి షర్మిల ఆరోపించారు.

     ఇచ్చిన హామీలను అమలు చేయని ఘనత చంద్రబాబుకే దక్కుతుందని శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, మద్యపాన నిషేదం వంటి వాగ్దానాలను తుంగలో తొక్కిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని, ఆ మాటలు ఎవరూ నమ్మొద్దన్నారు. తాను అధికారంలోకి వచ్చినపుడు రూ.147లు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను అధికారం కోల్పోయే నాటికి రూ.305 రూపాయలకు పెంచారన్నారు.  ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గ్యాస్ ధరలు పెంచలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచినా, ఆ భారం ప్రజల మీద పడకుండా సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే చెల్లించేలా చూశారన్నారు.  

     అవినీతి కేసులు ఎన్నో ఉన్నా తన మీద ఎటువంటి కేసులు నిర్ధారణ కాలేదని చంద్రబాబు ప్రగల్బాలు పలుకుతున్నారని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై రాజకీయ కుట్రలు పన్నుతున్నారన్నారు. ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావించి జగనన్న ఆందోళనా కార్యక్రమాలు చేస్తుంటే చూసి ఓర్వలేక అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. జగనన్న బయట ఉంటే రాజకీయంగా ఎదుర్కోలేక జైలుకు పంపించారన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ సీబీఐని పావుగా వాడుకుంటూ జగనన్నను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు నీచరాజకీయాలకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు.

     ఆర్టీసీ చార్జీలు, పన్నులు, గ్యాస్ ధరలు పెంచుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశమున్నా, చంద్రబాబు ముందుకు రావడం లేదని శ్రీమతి షర్మిల ఆరోపించారు. అవిశ్వాసం పెడితే ఈ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వానికి వంతపాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

    విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడి ఉండే కుటుంబం తమదని శ్రీమతి షర్మిల అన్నారు. త్వరలోనే జగనన్న బయటకు వస్తారని, రాజన్న రాజ్యం తీసుకు వస్తారన్నారు. ప్రజలు జగనన్నకు అండగా ఉండి ఆశీర్వదించాలని శ్రీమతి షర్మిల కోరారు.