విజయమ్మ ప్రచార భేరి

11 Aug, 2012 03:40 IST

హైదరాబాద్, నక్కపల్లి (విశాఖ జిల్లా), న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ కుట్రపూరితంగా అరెస్టు చేసిన నేపథ్యంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఈ నెల 30(బుధవారం) నుంచి ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టనున్నారు. ఆమె బుధవారం ఉదయాన్నే విశాఖపట్టణానికి విమానంలో బయలుదేరి వెళతారు.అనంతరం విశాఖలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు వెళ్లి ప్రచారంలో పాల్గొంటారు. తొలిరోజున ఆమె నరసన్నపేటతో పాటు పాయకరావుపేటలో కూడా ప్రచారంలో పాల్గొంటారు. విజయమ్మ పర్యటన వివరాలను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ మంగళవారం నక్కపల్లిలో మీడియాకు వెల్లడించారు. ఉప ఎన్నికలు జరుగుతున్న 18 శాసనసభా నియోజకవర్గాలతో పాటుగా నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోనూ ఆమె పర్యటిస్తారని చెప్పారు. ‘‘బుధవారం ఉదయం 8 గంటలకు విజయమ్మ విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు వెళతారు. సాయంత్రం 5 గంటలకు పి.ధర్మవరం నుంచి రోడ్‌షోను ప్రారంభించి జాతీయ రహదారి మీదుగా పాయకరావుపేట చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. గురువారం పాయకరావుపేట నుంచి బయలుదేరి కోటవురట్ల మండలంలో రోడ్ షో, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అక్కడ ప్రచారం పూర్తయిన తర్వాత రామచంద్రాపురం పర్యటనకు వెళతారు’’ అని వివరించారు.