విజయమ్మ ఫీజు దీక్షకు తరలిరండి
తిరుపతి, 4 సెప్టెంబర్ 2012 : విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి విప్పులు చెరిగారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గుర్తులు చెరిపేయాలన్న ఉద్దేశంతోనే ఈ సర్కార్ విద్యార్థుల జీవితాలను ఫణంగా పెట్టేందుకు కూడా వెనకాడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారంనాడు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పార్టీ గౌరవధ్యక్షురాలు చేపట్టే ఫీజు దీక్షకు విద్యార్థులు భారీగా తరలి రావాలని భూమన పిలుపునిచ్చారు. స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలంతూ ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చేందుకు విజయమ్మ ఈ నెల 6, 7 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద రెండురోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్నారని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. పేద విద్యార్థుల ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని, అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలన్న డిమాండ్లతో విజయమ్మ ఈ దీక్ష చేస్తున్నారని ఆయన అన్నారు. వార్డు బాటలో భాగంగా తిరుపతిలోని పలు వార్డులలో ఆయన మంగళవారం పర్యటించి స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.