ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాలి
మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ సమైక్య రాష్ట్రం కోసం తమ తమ పదవులకు రాజీనామా చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విస్తృత స్థాయి సమావేశ ముగింపు సందర్భంగా ఆమె ప్రసంగించారు. శ్రీమతి విజయమ్మ అధ్యక్షత వహించిన ఈ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర పాలక మండలి సభ్యులు, జిల్లా, మండల స్థాయి నాయకులు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుతో సహా ఆ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలంతా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేయలని పార్టీ బాధ్యులందరికీ ఆమె పిలుపు ఇచ్చారు. ఓట‌్లు, సీట్ల కోసం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాటాలు చేయదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్, టిడిపిలే ఆ పని చేస్తాయన్నారు.
సమైక్య ఉద్యమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు చురుగ్గా పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేద్దామని శ్రీమతి విజయమ్మ పిలుపు ఇచ్చారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని ఆయనపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెద్దామని చెప్పారు. ప్రజలందరి బాగు కోసం వైయస్‌ఆర్ కాంగ్రెస్ ఎప్పటికీ పాటుపడుతుందన్నారు. మనందరం కలిసి మహానేత డాక్టర్ వైయస్ఆర్ కలలు కన్న సువర్ణయుగాన్ని సాధిద్దామని ఆమె చెప్పారు.