విజయమే లక్ష్యంగా కృషి చేయండి: కొణతాల
20 Dec, 2012 11:30 IST
అనకాపల్లి (విశాఖపట్నం జిల్లా) : సహకార సంఘాల ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. తన క్యాంపు కార్యాలయంలో బుధవారంనాడు ఆయన చోడవరం, యలమంచిలి నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలు, నాయకులతో చర్చించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని మండలాలవారీగా పార్టీ బలాబలాలను కొణతాల ఆరా తీశారు. ఆయా మండలాల్లోని పిఎసిఎస్‌లు, సభ్యుల సంఖ్య, గతంలో అధికారంలో ఉన్న పాలకవర్గం, ప్రస్తుతం సభ్యత్వాల నమోదు ప్రక్రియ గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. వైయస్‌ఆర్‌సిపి తరఫున పిఎసిఎస్‌లలో పోటీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల స్థితిగతులు, సెగ్మెంట్‌లలో పోటీకి అర్హులు లేకుంటే కొత్తవారి ఎంపిక వంటి అంశాలపై కొణతాల విస్తృతంగా చర్చించారు.
సహకార ఎన్నికలకు సంబంధించి పిఎసిఎస్‌ల వారీగా విపక్ష పార్టీల వ్యవహారశైలి, వారు అవలంభించే విధానాలపై కార్యకర్తల వద్ద కొణతాల ప్రస్తావించారు. ఈ ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోవద్దని సూచించారు. సమన్వయంతో పనిచేసి సొసైటీలలో విజయం సాధించాలని సూచించారు. దీనితో పాటు సభ్యత్వ నమోదుపైన కూడా దృష్టి పెట్టాలన్నారు.