'వైయస్ కుటుంబంపై వెల్లువెత్తుతున్న అభిమానం'
3 Jan, 2013 13:47 IST
విజయనగరం : వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి విడుదల కోరుతూ ‘జగన్ కోసం.. జనం సంతకం’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. వైయస్ కుటుంబంపై ఉన్న అభిమానాన్ని ప్రజలు సంతకం రూపంలో చూపుతున్నారని పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ తెలిపారు. బుధవారం స్థానిక వైయస్‌ఆర్‌సిపి కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి జైలు నుంచి బయటకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ద్వారపురెడ్డి తెలిపారు.
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాజన్న రాజ్యం తిరిగి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ కుటిల రాజకీయాలను జెడ్పీ మాజీ చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు ఎండగట్టారు.
వైయస్‌ఆర్‌సిపిలో 60 కుటుంబాల చేరిక:
పార్వతీపురం : మండలంలోని బాలగుడబకు చెందిన 60 దళిత కుటుంబాలు బుధవారం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. పార్టీ నాయకుడు బోనెల మరియదాస్ ఆధ్వర్యంలో గ్రామంలో గడప గడపకూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడుతూ శ్రీ జగన్ అక్రమ అరెస్టును అందరూ తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.