వైయస్ఆర్ సీపీలో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి

29 Oct, 2012 19:03 IST
భువనగిరి

29 అక్టోబర్ 2012 : యువ తెలంగాణ కన్వీనర్ జిట్టా బాలకృష్ణారెడ్డి విజయమ్మ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్లగొండజిల్లా భువనగిరిలో సోమవారం సాయంత్రం జరిగిన ఒక భారీ బహిరంగసభలో జిట్టాకు పార్టీ కండువా కప్పి విజయమ్మ వైయస్ఆర్ సీపీలోకి ఆహ్వానించారు. భువనగిరిలో విజయమ్మకు ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్ నుండి భువనగిరి వెళ్లే దారిలో పలు చోట్ల విజయమ్మను ఆపి జనం స్వాగతించారు. మేళతాళాలతో, తెలంగాణ కళారూపాలతో అభిమానులు ఆమెను భువనగిరికి ఆహ్వానించారు.
భువనగిరి సభావేదికపై జై తెలంగాణ-జై జగన్ అన్న నినాదాలున్న భారీ కటౌట్లను అందంగా అలంకరించారు. సభలో సీనియర్ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో అన్ని సీట్లూ వైయస్ఆర్ సీపీ వశం అవుతాయన్నారు. వైయస్ పులి అయితే జగన్ పులిబిడ్డ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరో చేసిన పాపాలకు జగన్ పై వేస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్ కడప ఎన్నికలలో సాధించిన మెజారిటీ ఒక రికార్డు అని ఆయన అన్నారు.