వైయస్‌ఆర్ అంటే ఆరాధ్య దైవం: విశ్వేశ్వర్‌రెడ్డి
31 Oct, 2012 12:17 IST
అనంతపురం, 31 అక్టోబర్ 2012: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అంటే అనంతపురం జిల్లా ప్రజలకు ఆరాధ్య దైవం అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వై. విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ఆర్ సిపి అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టడం ద్వారా తమ పార్టీని మొగ్గలోనే తుంచేయాలని కాంగ్రెస్, టిడిపి పగటి కలలు కంటున్నాయన్నారు. అయితే, ఆ పార్టీ నాయకుల కలలు ఎప్పటికీ నెరవేరే ప్రసక్తే లేదని విశ్వేశ్వర్‌రెడ్డి ధీమాగా చెప్పారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఆయన షర్మిల వెంట నడుస్తున్నారు. ఉదయించే సూర్యుడిని అడ్డుకోవడం ఎవరి వల్లా కానట్లే జగన్‌ను ఆపడం ఢిల్లీ వల్ల కానే కాదన్నారు. అనంతపురం జిల్లాలో షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
షర్మిల పాదయాత్ర ఉరవకొండ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర దాదాపు 80 కిలోమీటర్ల మేరకు ఏడున్నర రోజుల పాటు కొనసాగుందని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఉరవకొండ నియోజకవర్గంలో సుమారు 80 వేల ఎకరాలకు పైగా హంద్రీ నీవా ప్రాజెక్టు కింద సాగయ్యే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను దాదాపుగా పూర్తి చేసిన ఘనత వైయస్ రాజశేఖరరెడ్డిదే అన్నారు. ఈ ప్రాంతంలో చంద్రబాబు హయాంలో దారుణంగా పడిపోయిన ఈ ప్రాంత భూముల ధరలు వైయస్ అధికారంలోకి వచ్చిన తరువాత బాగా పెరిగాయన్నారు. రైతుల్లో ఆశలు చిగురించాయని విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఒక నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు నీళ్ళివ్వడం అంటే మాటలు కాదన్నారు. అందుకే ఈ ప్రాంత ప్రజలకు రాజశేఖరరెడ్డి ఆరాధ్య దైవంగా నిలిచారని అన్నారు.
నీళ్ళు లేని రిజర్వాయర్గా పేరుపడిన పిఎబిఆర్‌కు 10 టిఎంసిల నీటిని కేటాయిస్తూ జీవో జారీ చేశారని తెలిపారు. కేవలం 250 మిల్లీమీటర్ల అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే కూడేరు ప్రాంతంలో వైయస్ జీవో కారణంగా పిఎబిఆర్ ప్రాజెక్టుకు నీళ్ళు వచ్చాయన్నారు. ఈ ప్రాజెక్టుకు నీళ్ళు రావడంతో భూగర్భజలాలు పెరిగాయన్నారు. బోర్లు బావుల కింద సేద్యం బాగా పెరిందని, దీనితో ఈ ప్రాంత ప్రజలకు వైయస్ ఆరాధ్య దైవంగా మారారని విశ్వేశ్వర్‌రెడ్డి అభివర్ణించారు.