ఉపాధి కరవు.. పిల్లల చదువులు బరువు

30 Oct, 2012 11:13 IST
అనంతపురం :

నీరులేక పంటలు ఎండిపోతున్నాయని అనంతపురం పట్టణంలోని లేపాక్షి నగర్ కు చెందిన మహిళలు షర్మిలకు మొరపెట్టుకున్నారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ సోదరి అయిన షర్మిలను వారు మంగళవారం కలిశారు. ఉపాధి హామీ పథకం పేరుకే ఉందనీ, ఉపాధి దొరకడం లేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల్ని చదివించుకోవాలి.. సాయం చేయండంటూ షర్మిలను వేడుకున్నారు. వారికి బదులిస్తూ... అన్ని సమస్యలకూ పరిష్కారం జగనన్న సీఎం కావడమేనని షర్మిల పేర్కొన్నారు. ఆరోజు రాజన్న రాజ్యం వచ్చి, సమస్యలు తీరతాయన్నారు. పిల్లిగుండ్ల కాలనీలో ప్రజలు ఆమెపై పూలవర్షం కురిపించారు. అక్కడి మహిళలూ, పిల్లలతో ఆమె ముచ్చటించారు.
     కళ్యాణ దుర్గం బైపాస్ నుంచి వైయస్ షర్మిల పదమూడో రోజు పాదయాత్ర మంగళవారం ఉదయం పది గంటలకు  ప్రారంభమైంది.  పెద్ద సంఖ్యలో అభిమానులు వెంట నడువగా.. జగన్ జయజయ ధ్వానాల నడుమ ఆమె యాత్రను ఆరంభించారు. ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, తదితరులు ఆమె వెంట ఉన్నారు.  షర్మిల పిల్లిగుండ్ల కాలనీ, నీనం రాజశేఖర్ రెడ్డి నగర్, సిండికేట్ నగర్ మీదగా మధ్యాహ్నానికి రూట్ పబ్లిక్ స్కూల్ వరకు చేరుకుంటారు. భోజన విరామం అనంతరం రాచానపల్లి, ఉరవకొండ నియోజకవర్గం లెప్రసీ కాలనీ మీదగా బొద్కూరు క్రాస్, బ్రాహ్మణపల్లి, కమ్మూరు క్రాస్ చేరుకుంటారు. ఆమె కమ్మూరులో రాత్రికి బస చేస్తారు.