ఇదంతా చంద్రబాబు కుట్ర

11 Jun, 2016 18:39 IST

() సాక్షి, ఇతర ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేయడం దుర్మార్గం

() చంద్రబాబు కుట్రలో భాగమే సాక్షిపై వేటు

() చంద్ర బాబుది మూర్ఖత్వం

 అనంతపురం:             ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సాక్షి ఛానెల్ ప్రసారాల్ని నిలిపివేయటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

అణచివేతే బాబు మార్గం

అణచివేతల ద్వారా ప్రభుత్వ పాలన నడిపించాలనుకోవడం సాధ్యం కాదని చంద్రబాబు అర్థం చేసుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి సూచించారు.     ప్రజా సమస్యలపై పాలకపక్షం కళ్లు తెరిపించే విధంగా నిజాలను చూపిస్తున్న సాక్షి మిగతా మూడు ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయడాన్ని ఆయన పూర్తిగా ఖండించారు. తనను ఎవరూ వ్యతిరేకించకూడదని, నేనే చెప్పిందే వేదం అన్నట్లుగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసినా అనుకూలంగా లేకపోయిన ఛానెళ్లపై చంద్రబాబు ఆయన కోటరీ బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. పత్రిక ప్రతినిధులుగా ఎవరుండాలనే నిర్ణయించే స్థాయికి చంద్రబాబు దిగజారారని చెప్పారు. గత కొంత కాలంగా సాక్షి ప్రతిక, ఛానల్‌ను స్వాధీనం చంద్రబాబు బెదిరింపులకు పాల్పడుతున్నారని, చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల ప్రెస్‌మీట్‌లు పెట్టీ మరీ సాక్షిని స్వాధీనం చేసుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. ముద్రగడ దీక్షకు సంబంధించిన వార్తలను చూపించిన సాక్షి, ఇతర మూడు ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేయడం దుర్మార్గమైన చర్యగా పరిగణిస్తున్నామని చెప్పారు. సాక్షి ప్రసారాలను నిలిపివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గతంలో ఎమర్జెన్సీ పరిపాలన ద్వారా ప్రజల గొంతు నొక్కిన ఇందిరాగాంధీ మరోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవని గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబుకు సూచించారు. రాష్ట్రంలో తానొక్కడే అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాలను గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ప్రతిపక్షాలు చేసే కార్యక్రమాలను కూడా సహించలేని పరిస్థితికి ప్రభుత్వం దిగజారిపోయిందని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చిస్తున్న ప్రతిపక్షాల గొంతు ఎత్తనివ్వకుండా నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని, ప్రజాసమస్యలపై మాట్లాడిన ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేస్తూ అవమానించే విధంగా చంద్రబాబు సర్కార్‌ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అప్రజాస్వామిక ధోరణితో ముందుకు వెళ్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకించాలన్నారు. ఇలాంటి విధనాలకు పాల్పడితే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబును హెచ్చరించారు. 

బాబుది మూర్ఖత్వం

 సూర్యకాంతిని అరచేతినిపెట్టి ఆపాలేరో.. సాక్షి ప్రసారాలను నిలిపివేస్తే నిజాలు బయట ప్రజలకు తెలియవనుకోవడం అంత మూర్ఖత్వమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల్లో రోజురోజుకు నిరంకుశ, నియంతృత్వ ధోరణితో ముందుకు వెళ్తుందని మండిపడ్డారు. రాజ్యాంగం దేశ ప్రజలకు ప్రసాదించిన ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌ను కూడా చంద్రబాబు హరించివేస్తున్నాడని ధ్వజమెత్తారు. సాక్షి, ఇతర మూడు ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేయడం చంద్రబాబు నియంతృత్వ ధోరణికి అద్దంపడుతుందని వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రజాస్వామ్య మౌళిక సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యే లేకపోతే తిరిగి ముఖ్యమంత్రి అయ్యేవాడివా అని చంద్రబాబును నిలదీశారు. దేశంలో రాజ్యాంగం ప్రసాదించిన విలువలు ఉన్నాయి కాబట్టే తిరిగి ముఖ్యమంత్రివయ్యావని అర్థం చేసుకోవాలని చంద్రబాబుకు సూచించారు. కేవలం తాను ఏది మాట్లాడితే అది ప్రసారాలు చేయాలి, పత్రికల్లో రాయాలి అనే ప్రభుత్వ వైఖరిని ఆయన పూర్తిగా ఖండించారు. కొన్ని పచ్చమీడియాలను చేతుల్లో పెట్టుకొని చంద్రబాబు అవినీతిని కప్పిపుచ్చుకుంటున్నాడని దుయ్యబట్టారు. బాబు అవినీతి చర్యలు, నియంతృత్వ పోకడలు, దౌర్జన్యాలు పరాకాష్టకు చేరుకున్నాయని చెప్పారు. విదేశాలతో కుమ్మకై వ్యాపారాలను విస్తరించుకునే ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తుందని సాక్షిపై కక్షకట్టి ప్రసారాలను నిలిపివేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఛానల్‌ను నిలిపివేస్తే తీవ్రంగా ఖండించిన టీడీపీ ఇప్పుడు ఎందుకు ఛానళ్లను నిలిపివేసిందని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రభుత్వం వ్యవహరించిన ధోరణిలోని ఇక్కడ కూడా చంద్రబాబు వ్యహరిస్తున్నారని, అక్కడ టీడీపీని విడిచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయిన ఎమ్మెల్యేల లోటు పూడ్చుకోవడానికి ఆం«ద్రరాష్ట్రంలో డబ్బులిచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బాబు కొనుగోలు చేస్తూ తీవ్ర అన్యాయానికి ఒడిగడుతున్నాడని ఫైరయ్యారు.