వైయస్ జగన్‌తోనే సంక్షేమ రాజ్యం
22 Jun, 2018 11:56 IST
అనంతపురం: వైయస్ జగన్ మోహన్ రెడ్డితోనే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ రాజ్యం మళ్లీ వస్తుందని వైయస్ఆర్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వేరుశనగ పంటకు మద్దతు ధర విత్తుకు ముందే ప్రకటించాలని డిమాండు చేస్తూ ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రైతు ధర్నాలో ఆయన ప్రసంగించారు.
రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, రైతుల బాగు కోసం ప్రాణాలైనా ఇస్తామన్నారు. రైతుగా పుట్టాను. రైతుల కోసమే జీవిస్తాను.. అవసరమైతే వారి కోసమే చస్తాను అని స్పష్టం చేశారు. ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేసే రైతులకు భరోసానందించేందుకు కిలో రూ.61 చొప్పున పంటకు ముందస్తుగా మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. రేషన్ దుకాణాల ద్వారా వేరుశనగ నూనె సరఫరా చేయిస్తే రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్నారు. ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గంలో బ్రోకర్లదే రాజ్యం నడుస్తోందని ప్రకాష్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాజన్న రాజ్యం రావాలంటే వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. ఆయన సీఎం అయితే రైతులకు గిట్టుబాటు ధర వేరుశనగకు రూ. 61 ప్రకటిస్తామని చెప్పారు.