కడప జెడ్పీ సమావేశంలో ఉద్రిక్తత

9 Sep, 2018 15:03 IST

నిరసనగా వేదికపై కూర్చున్న వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు

కరువు మండలాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్‌

 వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్ ఆర్ కడప జెడ్పీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రొటోకాల్‌ ఉల్లంఘించారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ సమావేశానికి ఆప్కో చైర్మన్‌ గుజ్జల శ్రీనివాస్‌ హాజరుకావడం ఏంటని ప్రశ్నించారు. ఏ హోదాలో ఆయన సమావేశానికి వచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఆయన రాకపై  నిరసన వ్యక్తం చేశారు.  సమావేశానికి హాజరైన టీడీపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డిలు సభా మందిరంలోకి రావడంతో ఉద్రిక్తతగా మారింది. టీడీపీ, వైయస్‌ఆర్‌ సీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రొటోకాల్‌ ఉల్లంఘనకు నిరసనగా వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, రవీంద్రనాథ్‌రెడ్డిలు వేదికపై కూర్చున్నారు. ఆప్కో చైర్మన్‌ హాజరు కావడాన్ని అధికారులు కూడా తప్పుబట్టారు. 

 పట్టిసీమతో ఎన్ని ఎకరాలు తడిపారు..?

 కరువు పరిస్థితులతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభలో నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో  వర్షాలు లేక  రైతాంగం తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటోందన్నారు. జిల్లాలో 50 మండలాలను కరువు మండలాలగా ప్రకటించారని, కానీ ఆదుకునేందుకు చర్యలు మాత్రం చేపట్టడం లేదన్నారు. మంత్రులు జిల్లా రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరిచ్చామన్న మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యలకు గడికోట ఘాటుగా సమాధానం ఇచ్చారు. పట్టిసీమ ద్వారా ఎన్ని ఎకరాలను తడిపారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.