నాసిరకం నిర్మాణాలపై టీడీపీ సమాధానం చెప్పాలి

7 Jun, 2017 18:51 IST

కంకిపాడు :రాజధాని అమరావతిలో నిర్మితమైన తాత్కాలిక అసెంబ్లీ చిన్న వర్షానికే  అధ్వానంగా మారటంపై టీడీపీ ప్రజలకు సమాధానం చెపాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బండి నాంచారయ్య డిమాండ్‌ చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాంచారయ్య మాట్లాడుతూ చదరపు అడుగు రూ 1500 నుంచి రూ 2 వేలకు నిర్మాణం జరుగుతుంటే టీడీపీ ప్రభుత్వం తన అనుయాయులకు రూ 9600 చొప్పున కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచి పెట్టారని విమర్శించారు. చిన్న వర్షానికే నాసిరకంగా జరిగిన నిర్మాణాల తీరు బయటపడిందన్నారు. వరదలు వస్తే రాజధాని ప్రాంతం సురక్షితంగా ఉంటుందా? అనే భయం రాజధాని ప్రాంత వాసుల్లోనెలకొందన్నారు. బినామి సంస్థలకు ఎకరం రూ 22 లక్షలకే కట్టబెట్టడం సిగ్గు చేటన్నారు. సింగపూర్‌ కంపెనీలతో కుదుర్చుకున్న భూముల ఒప్పందాలను రద్దు చేయాలన్నారు. చరిత్ర గల స్వరాజ్య మైదానం చైనా ప్రైవేటు సంస్థకు అప్పగించటం దారుణమన్నారు. ఒప్పందాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి మాదు వసంతరావు, జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు బాకీ బాబు, పట్టణ అధ్యక్షుడు మేదండ్రావు కుటుంబరావు పాల్గొన్నారు.