రోజాపై టీడీపీ కక్ష సాధింపు చర్యలు
5 Mar, 2017 11:20 IST
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అధికార టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే ఏడాది పాటు రోజాను అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేసిన టీడీపీ మరో ఏడాది పాటు కూడా సస్పెన్షన్ చేయాలని కుట్రలు పన్నుతోంది. రోజాను మళ్లీ ఏడాది పాటు సస్పెన్షన్‌లో ఉంచాలని ఏపీ శాసనసభా ప్రివిలేజస్ కమిటీ నిర్ణయించినట్లు ప్రభుత్వ పెద్దల నుంచి ఓ వర్గం మీడియాకు లీకులు అందాయి. అమరావతిలోని కొత్త అసెంబ్లీలో శనివారం తొలిసారిగా సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని అధికార పక్షం లీకులిచ్చింది. ప్రత్యేక హోదా సాధన కోసం పాత అసెంబ్లీలో పట్టుబట్టిన పలువురు ఎమ్మెల్యేలను కూడా ఆరు నెలల పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేయాలని కూడా ఈ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు సిద్ధం చేసిన నివేదికను శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుకు సమర్పించినట్లు తెలిసింది. ఈ నివేదిక ఈ నెల 7వ తేదీన సభ ముందుకు రావచ్చని భావిస్తున్నారు.