టీడీపీకి కేసుల ఉచ్చు

7 Mar, 2017 16:49 IST
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార పార్టీకి గ‌డ్డు ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అధినేత మొద‌లు మంత్రుల వ‌ర‌కు న్యాయ‌స్థానాలు షాక్‌లిస్తున్నాయి. నిన్న సీఎం చంద్ర‌బాబుకు ఓటుకు కోట్లు కేసులో సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయ‌గా..ఇవాళ మంత్రి గంటా శ్రీనివాసరావుకు హైకోర్టు నోటీసులు, స్పీక‌ర్ కోడెల‌కు క‌రీంన‌గ‌ర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. వ‌రుస కోర్టు నోటీసుల‌తో టీడీపీలో వ‌ణుకు మొద‌లైంది.

గంట శ్రీనివాసరావు  తన ప్రత్యూష సంస్థకు ఇండియన్‌ బ్యాంకు రుణం తీసుకున్న విషయంలో హైకోర్టులో విచారణ చేపట్టారు. ప్రభుత్వ భూమి తనఖా పెట్టి మంత్రి గంటా రుణం తీసుకున్నారని పిటిషనర్ ఆరోపించారు. సంస్థకు హామీదారుగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు సహా ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని  హైకోర్టు ఆదేశించింది.

 తాజాగా కోడెల‌కు క‌రీంన‌గ‌ర్ కోర్టు ఆదేశాలు జారీ చేయ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. వైయస్సార్సీపీ క‌రీంన‌గ‌ర్ జిల్లా అధ్య‌క్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేర‌కు హైకోర్టు ఆదేశాల‌తో క‌రీంన‌గ‌ర్ కోర్టు స్పీక‌ర్‌కు నోటీసులు ఇచ్చింది. 2014 ఎన్నికల్లో తాను ఎన్నిక కావటానికి రూ.11 కోట్ల 50 లక్షలు ఖర్చు చేశానని కొన్ని రోజుల క్రితం ఓ టీవీ ఛానల్ ఇంటర్వూలో కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. ఇంత మొత్తం ఖర్చు చేయటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఈ విషయమై కోడెలపై చర్యలు తీసుకోవాలని వైయస్సార్సీపీ కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు.
 
ఈ మేరకు న్యాయస్థానం భాస్కర్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేయాలని కరీంనగర్ చీఫ్‌ జుడీషియల్ మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలతో మంగళవారం స్పెషల్ మొబైల్ పీసీఆర్ మెజిస్ట్రేట్ సతీష్ కుమార్ వివిధ సెక్షన్లు 171E, 171F, 171B, 171H, 171i, 200 IPCల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. ఏప్రిల్ 20న కరీంనగర్ కోర్టుకు హాజరుకావాలని కోడెల శివప్రసాదరావుకు సమన్లు జారీ చేశారు.