వైఎస్ కృషి వల్లే స్టీల్‌ప్లాంట్‌కు పునరుజ్జీవం: గౌతంరెడ్డి
14 Feb, 2015 15:35 IST
విశాఖపట్నం: విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుని, భారీ విస్తరణ దిశగా తీసుకువెళ్లిన ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డికి దక్కుతుందని వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి అన్నారు. ఆర్ నంబర్లు బదిలీ చేసి ఉద్యోగాల్లో 50 శాతం కోటా తీసుకువచ్చి ఉక్కు నిర్వాసితులకు ఉపాధి కల్పించిన మహోన్నత వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు. స్టీల్ ప్లాంట్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు వైఎస్సార్‌టీయూసీకి మాత్రమే ఉందన్నారు. విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం గొడ్డువాని పాలెం గ్రామంలో జరిగిన వైఎస్సార్‌టీయూసీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నోసార్లు ప్రజల దృష్టికి తీసుకువచ్చారని, వీటిని నిజం చేస్తూ ఉక్కు గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఇంటక్, టీఎన్‌టీయూసీ కలసి పరిరక్షణా సమితిగా పోటీ చేయడం కార్మికులు గమనించాలన్నారు. టీడీపీ, కాంగ్రెస్ అపవిత్రమైన కలయిక, లోపాయికారి ఒప్పందాలు కార్మికులు గుర్తించి వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.