నరసింహారావు కుటుంబానికి జగన్ భరోసా
అనారోగ్యంతో శనివారం మరణించిన మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్చూరు సమన్వయకర్త గొట్టిపాటి నరసింహారావు భౌతికకాయాన్ని పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆదివారం సందర్శించారు. నరసింహారావు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నప్పుడు కూడా నరసింహారావును శ్రీ జగన్ పరామర్శించి, కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే.. నరసింహారావు తుదిశ్వాస విడిచారని తెలుసుకున్న శ్రీ జగన్మోహన్‌రెడ్డి తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని జిల్లాకు వచ్చారు.
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి ఆదివారం ఉదయం తెనాలి వచ్చి అక్కడి నుంచి చిలకలూరిపేట మీదుగా యద్దనపూడిలోని గొట్టిపాటి స్వగృహానికి శ్రీ జగన్ చేరుకున్నారు. నరసింహారావు భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన భార్య పద్మ, కుమారుడు భరత్, కుమార్తె లక్ష్మిలను ఓదార్చారు. ఆయన తమ్ముడి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను ఓదార్చి ధైర్యం చెప్పారు. దాదాపు గంటపాటు గొట్టిపాటి నివాసంలో గడిపిన అనంతరం శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.